ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్తు సరఫరా నిలిస్తే కొవిడ్‌ రోగులకు అవస్థలే

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రుల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో విద్యుత్తు సరఫరాలో పలు లోపాలు గుర్తించినట్లు విద్యుత్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరా అత్యంత కీలకమైనందున అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని.. సరఫరాలో సమస్య తలెత్తి కరెంట్‌ ఆగిపోతే రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందమని విద్యుత్తు నిపుణులు చెబుతున్నారు.

Power position bad at Guntur district
విద్యుత్తు సరఫరా నిలిస్తే కొవిడ్‌ రోగులకు అవస్థలే

By

Published : May 18, 2021, 9:08 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రుల్లో పడకలన్నీ పూర్తిస్థాయిలో నిండాయి. ఈమేరకు విద్యుత్తు వినియోగం అనూహ్యంగా పెరిగింది. నిరంతర విద్యుత్తు సరఫరాతోపాటు సాంకేతిక కారణాలతో సప్లయి ఆగిన వెంటనే ఆటోమేటిక్‌గా జనరేటర్ల ద్వారా విద్యుత్తు సరఫరా అయ్యేలా అన్ని ఆసుపత్రులు జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే 24 గంటలూ విద్యుత్తు సరఫరా ఉండటంతో కొన్నాళ్లుగా జనరేటర్ల వినియోగం లేదు. దీంతో కొన్నింటిలో నిర్వహణ లోపాలు తలెత్తాయి. ప్రస్తుతం తుపాన్‌ సీజన్‌ కావడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఎదురయ్యే అవకాశం ఉంది. గాలి వానకు విద్యుత్తు లైన్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్ల ద్వారా విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రి యాజమాన్యాలు అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌలికవసతులు, నిర్వహణ తదితర అంశాలపై విద్యుత్తు, అగ్నిమాపక, రెవెన్యూ తదితర అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేయించింది. తనిఖీల్లో విద్యుత్తు సరఫరాలో పలు లోపాలు గుర్తించినట్లు విద్యుత్తు శాఖ అధికారులు నివేదికలో పొందుపరిచారు. లోపాలను యుద్ధప్రాతిపదికన ఆసుపత్రి యాజమాన్యాలు సరిదిద్దుకునేలా చర్యలు చేపట్టారు. విద్యుత్తు సరఫరా అత్యంత కీలకమైనందున అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్తు నిపుణులు చెబుతున్నారు. సరఫరాలో సమస్య తలెత్తి కరెంట్‌ ఆగిపోతే వైద్య పరికరాలు పనిచేయక రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో....
ప్రభుత్వ సమగ్రాసుపత్రి(జీజీహెచ్‌)లో విద్యుత్తు సరఫరాకు సంబంధించి చిన్న చిన్న లోపాలు సరిదిద్దడానికి విద్యుత్తు శాఖ గతంలోనే జిల్లా యంత్రాంగానికి నివేదిక ఇచ్చింది. తక్షణమే రూ.15 లక్షలు వెచ్చించి కొన్నిచోట్ల అంతర్గత విద్యుత్తు సరఫరా తీగలు మార్చడం, ఎంసీసీబీల నిర్వహణ, సబ్‌ప్యానల్‌ బోర్డుల నిర్వహణ తదితర అంశాలపై వెంటనే దృష్టిసారించాలని నివేదించింది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా కొత్తగా 500 కేవీఏ జనరేటర్‌ కొనుగోలు చేయడం, జనరేటర్‌ నుంచి ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు విద్యుత్తు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయడం, అంతర్గతంగా కొన్ని మరమ్మతుకు కలిపి రూ.60లక్షలతో ప్రతిపాదనలు ఇచ్చారు. ఇందులో చాలావరకు ఇప్పటికీ అమలుకాలేదు. ప్రాధాన్యం దృష్ట్యా జీజీహెచ్‌లో అవసరమైన పనులను వెంటనే పూర్తిచేయాల్సి ఉంది.

తనిఖీల్లో గుర్తించిన లోపాలివీ..

  • ఆసుపత్రులు ఎలక్ట్రీషీయన్‌ను నియమించుకుని ఎప్పటికప్పుడు సరఫరా పరిశీలిస్తూ లోపాలు తలెత్తితే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. గుంటూరు నగరంలోనే 33 ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రులు ఉన్నాయి. చాలావాటిలో ప్రత్యేకంగా ఎలక్ట్రీషీయన్‌ అందుబాటులో లేరు. అవసరమైప్పుడు పిలిపించుకుని పని చేయించుకున్నట్లు గుర్తించారు.
  • జనరేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ అందులో సరిపడినంత డీజిల్, నిర్వహణలో లోపాలు గుర్తించారు.
  • ఎలక్ట్రికల్‌ ప్యానల్‌ బోర్డుల వద్ద డస్ట్‌బిన్‌లు, అట్టపెట్టెలు, చెత్త ఉన్నట్లు గుర్తించారు. విద్యుత్తు ప్రమాదాలకు ఇవి కారణమవుతాయి.
  • కొన్ని ఆసుపత్రుల్లో ఎర్తింగ్‌ సక్రమంగా లేనట్లు గుర్తించారు.
  • జనరేటర్‌లో మదర్‌బోర్డు అత్యంత కీలకం. విద్యుత్తు సరఫరా ఆగిన వెంటనే మదర్‌ బోర్డు పని చేస్తేనే ఆటోమేటిక్‌గా జనరేటర్‌ ఆన్‌ అయి సరఫరా పునరుద్ధరిస్తుంది. కొన్ని ఆసుపత్రుల్లో వీటి నిర్వహణ సక్రమంగా లేదు.
  • నగరంలోని కొత్తపేటలో గుండె సంబంధిత వ్యాధులకు ప్రసిద్ధిచెందిన ప్రముఖ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రిక పరిసరాల్లో నీరు నిల్వ ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారులు గుర్తించారు. వెంటనే నీటిని తోడేయడంతో పాటు భవిష్యత్తులో నీరు రాకుండా చుట్టూ గోడ నిర్మాణం, నియంత్రిక ఎత్తులో ఉంచాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి పూర్తిచేశారు.
  • అరండల్‌పేటలోని ఒక ఆసుపత్రిలో ఎలక్ట్రికల్‌ ప్యానల్‌ బోర్డు ఒకవైపు మరోవైపు గోడ ఉన్నాయి. వీటి మధ్య రోగులు మరుగుదొడ్లకు వెళ్లాల్సి ఉంది. ప్యానల్‌ బోర్డు వద్ద వ్యర్థాలు సైతం వేశారు. రోగులు మరుగుదొడ్డికి వెళ్లే క్రమంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిని యాజమాన్యం దృష్టికి తీసుకెళితే రోగులకు ప్రత్యామ్నాయ దారి ఏర్పాటుచేశారు. ప్యానల్‌ బోర్డు వద్ద వ్యర్థాలు తొలగించారు.

ఇలా చేస్తే... ప్రమాదాలకు అడ్డుకట్ట

  • ఎర్త్‌ లీకేజ్‌ సర్య్కూÆట్‌ బ్రేకర్స్‌ ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఎక్కడైనా విద్యుత్తు లీకేజీ ఉన్నట్లయితే సరఫరా ఆగిపోయి షార్ట్‌సర్య్కూÆట్‌ కాకుండా ఉంటుంది.
  • ప్రతి ప్యానల్‌ బోర్డు వద్ద అగ్నిని ఆర్పే కార్బన్‌డయాక్సైడ్‌ పరికరాలు ఏర్పాటుచేసుకోవాలి.
  • ప్రతి ప్యానల్‌బోర్డుకు డబుల్‌ ఎర్తింగ్‌ చేయడం వల్ల షాక్‌ తగలకుండా ఉంటుంది.
  • ఆసుపత్రులకు ఏర్పాటుచేసిన విద్యుత్తు నియంత్రిక వద్ద ఎర్తింగ్‌ తనిఖీ చేసి పాడయినట్లయితే వెంటనే పునరుద్ధరించుకోవాలి.
  • ఆసుపత్రి నిర్వహణకు ఎంత కేవీఏ సామర్థ్యంతో విద్యుత్తు వాడుతున్నామో ఆ మేరకు సర్య్కూÆట్‌ బ్రేకర్లు ఏర్పాటుచేసుకోవాలి.
  • ప్యానల్‌బోర్డుల వద్ద చెత్త, చీపుర్లు వంటి వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి.
  • విద్యుత్తు సరఫరా తీగలు ఒక గోడకు, ఆక్సిజన్‌ సరఫరా చేసే పైపులైన్లు మరో గోడకు ఏర్పాటుచేసుకోవాలి. ఒకే గోడకు ఏర్పాటుచేసుకోవాల్సి వస్తే ఆక్సిజన్‌ పైపులైన్‌ కిందవైపు దానికి పైన ఎత్తులో విద్యుత్తు తీగల పైపులైను వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆక్సిజన్‌ లీకైనా ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చు.
  • జనరేటర్లు ఓవర్‌ లోడింగ్‌ కావడంలో కొంతసేపు పనిచేసిన తర్వాత ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సామర్థ్యం మేరకు జనరేటర్‌ ఏర్పాటుచేసుకోవాలి. ఏదైనా జనరేటర్‌ ఆగిపోతే మాన్యువల్‌గా చేయడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. - సురేష్‌బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, టౌన్‌-1, విద్యుత్తుశాఖ

ఇదీ చదవండి..'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

ABOUT THE AUTHOR

...view details