Babu Surety Future Guarantee Program: వచ్చే 6 నెలలు పార్టీ ఏదైనా కార్యక్రమం చెప్తే చేయాల్సిందేనని.. ఇందుకు ఎవరూ అతీతులు కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీకి అనుకూల పవనాలు మొదలయ్యాక.. అప్పుడొచ్చి ఆ వేవ్‌లో గెలుస్తామంటే కుదరదని.. అందరూ కలిసే ఆ వేవ్‌ను సృష్టించాలని స్పష్టం చేశారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి.. పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందో నేతలు ప్రజలకు వివరించనున్నారు.
ప్రజా చైతన్యం తీసుకురావడంతో పాటు, వారికి నమ్మకం కలిగించేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పుట్టిందే తెలుగుదేశంతో అనే విషయాన్ని గుర్తు చేస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు జగన్ ఇస్తున్నదానికి 3 రెట్లు ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తామనే విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎంతో చేయాలని శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. వారిని ఇబ్బందిపెట్టిన వారిని విడిచిపెట్టేది లేదన్నారు. అధికారంలోకి రాగానే రాజకీయ రౌడీలను తుదముట్టిస్తానని హెచ్చరించారు.
45 రోజుల్లో 3 కోట్ల మంది ఓటర్లను కలవడమే లక్ష్యంగా సెప్టెంబరు 1 నుంచి ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. 75 శాతం ఓటర్లును ఇందులో కవర్ చేయాలని, ఎన్నికల్లోగా నూరు శాతం ఓటర్లను వ్యక్తిగతంగా కలవాలన్నది లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ బూత్‌స్థాయి కార్యకర్తల నుంచి చంద్రబాబు వరకు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తారు. చంద్రబాబు 30 నియోజకవర్గాలకు వెళ్తారు.