రాష్ట్రంలో పెట్టుబడిరహిత ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధమని... అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ను కలిసి పలు అంశాల గురించి వివరించారు. రూ.100కోట్ల మేర ఆర్థిక సహకారాన్ని అందించేందుకు సిద్ధమని సీఎంకు తెలిపారు. దీనికి సంబంధించి సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు.
ప్రకృతి వ్యవసాయంపై సమర్ధవంతమైన విధి విధానాలు రూపకల్పన చేయాల్సిన అవసరముందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఔత్సాహికులైన రైతులకు సేంద్రీయ ఎరువులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నాణ్యమైన పురుగులమందులు, ఎరువులు రైతులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న సీఎం... నియోజకవర్గానికి ఒకటి చొప్పున నాణ్యతా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించటంతో పాటు ధరల స్థిరీకరణ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి తెలిపారు.