దిశ చట్టం పనితీరు.. దిశ చట్టాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై గుంటూరులో వైకాపా నేతలు విద్యార్ధినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దిశ చట్టాన్ని ప్రజలలో తీసుకువెళ్లడానికి మాస్క్‌లపై దిశ యాప్, దిశ టోల్ ఫ్రీ నెంబర్లను ముద్రించి విద్యార్ధినులకు అందచేశారు. దిశ చట్టం చిన్నారులకు, మహిళలకు గొప్ప వరమని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రతి ఆడపిల్ల ఒక అడపులిగా మారి.. సమస్యను దైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలన్నారు.
తల్లిదండ్రులు.. పిల్లలను చిన్న వయసు నుంచి సరైన మార్గంలో పెంచాలని సూచించారు. దిశ చట్టాలతో పాటు స్వీయ రక్షణ కూడా చాలా ముఖ్యమని హోంమంత్రి తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండా విద్యను సాగిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. మహిళలు, విద్యార్థినుల కోసం.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సుచరిత సూచించారు.