ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై కీలక పరిణామం.. అందుకు ఏజీ నిరాకరణ - Venkataramani refusal on new Krishna Tribunal

AG on krishna Tribunal: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు విషయంలో అభిప్రాయం తెలిపేందుకు అటార్నీ జనరల్‌ వెంకటరమణి నిరాకరించారు. దీంతో ఆ ఫైల్‌ను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు కేంద్రం పంపింది. తుషార్‌ మెహతా అభిప్రాయం తర్వాత కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

krishna Tribunal
కృష్ణా ట్రిబ్యునల్‌

By

Published : Feb 3, 2023, 7:27 PM IST

Updated : Feb 3, 2023, 7:56 PM IST

AG on krishna Tribunal: కొత్త కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలా? వద్దా? అనే దానిపై అభిప్రాయం తెలిపేందుకు అటార్నీ జనరల్‌ వెంకటరమణి నిరాకరించారు. కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై గతంలోనే ఏజీ అభిప్రాయాన్ని కేంద్రం కోరింది. అయితే, ఏజీగా ఆయన బాధ్యతలు చేపట్టక ముందు.. సీనియర్‌ న్యాయవాదిగా ఏపీ ప్రభుత్వం తరఫున కొన్ని కేసుల్లో హాజరైనందున తన అభిప్రాయాన్ని చెప్పలేనని స్పష్టం చేశారు. దీంతో ఆ ఫైల్‌ను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు కేంద్రం పంపింది.

రాష్ట్ర విభజన తర్వాత.. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును నోటిఫై చేయాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పలుమార్లు పేర్కొంది. కేంద్రం హామీ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకుంది.

కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తొలుత కేంద్ర న్యాయశాఖ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌తోనే విచారిస్తే సరిపోతుందని అభిప్రాయపడింది. దీనిపై అటార్నీ జనరల్‌ అభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఏజీ అభిప్రాయాన్ని కోరింది. ఇందుకు ఏజీ విముఖత చూపడంతో ఆ దస్త్రాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు కేంద్రం పంపింది. తుషార్‌ మెహతా అభిప్రాయం తర్వాత కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వాటా తేల్చాల్సిందే..: కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల మరోసారి డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నరేళ్లు అవుతున్నా నేటికీ కృష్ణా జలాల వాటా తేల్చలేదన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్‌కు ఓ ఉత్తరం రాయడానికి కూడా కేంద్రానికి తీరిక లేదని కేటీఆర్ అన్నారు. పాలమూరు ఎండాలనే దురాలోచనతో ఉన్నారని దుయ్యబట్టారు. 813 టీఎంసీల కృష్ణా జలాల్లో వాటాతేల్చలేదని, ఈ బేసిన్‌లోనే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు, హైదరాబాద్‌ మహానగరం ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 3, 2023, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details