Attacks on Police Under YCP Government:పోలీసులను చూసి నేరగాళ్లు సహా ఎవరైనా భయపడతారు. కానీ జగన్ పాలనలో అధికార పార్టీ నాయకుల్ని చూసి పోలీసులే హడలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. పోలీసు స్టేషన్లపైనే కాదు పోలీసు అధికారులపైనా దాడులు, ముష్ఠిఘాతాలు సర్వసాధారణమైపోయాయి. మెజార్టీ సందర్భాల్లో అసలు కేసే నమోదు చేయట్లేదు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తే నామమాత్ర సెక్షన్లతో సరిపెట్టేస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు. ఫిర్యాదుదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి వారంతట వారే కేసు వెనక్కి తీసుకొనేలా బెదిరిస్తారు. అయినా లొంగకపోతే బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్నారు. పోలీసులే రక్షించండని చేతులెత్తి మొక్కుకుంటున్నా ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, చివరకు పోలీసుల సంఘమూ పట్టించుకోని దుస్థితి దాపురించింది.
YCP Leaders Attacks on Police:‘పోలీసులైతే మాకేంటి?’ అంటూ మేం చెప్పిందే వేదమంటూ అడ్డొస్తే అంతు చూస్తామంటూ వైఎస్సార్సీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే కాదు చివరికి వారి వద్ద పనిచేసే సిబ్బందీ రక్షక భటులపై దాడులకు తెగబడుతున్నారు. వాతలు తేలేలా తలలు పగిలేలా హింసిస్తూ రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా జగన్ నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. మాటవరసకైనా వారి పక్షనా మాట్లాడటం లేదు. ఇక హోంమంత్రి, డీజీపీ అయితే సరేసరి. ఒక్కరంటే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పోలీసులకే భద్రత ఇవ్వలేని ఉన్నతాధికారులు ఇక సామాన్యులను ఏం కాపాడతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ కొంతమంది పోలీసు అధికారులు చేస్తున్న అరాచకాలను ప్రతిపక్ష నాయకులు తప్పు పట్టడమే తరువాయి వారిపైన ఒంటికాలితో విరుచుకుపడుతూ రాజకీయపరమైన విమర్శలు చేసే పోలీసు అధికారుల సంఘం వైసీపీ నాయకుల అరాచకాలపై మాత్రం అస్సలు నోరెత్తడం లేదు. కనీసం ఖండించిన పాపాన పోలేదు.
Kadapa District:కడపలో నిఘా విభాగం ఇన్‌స్పెక్టర్ అనిల్ వీపుపై వాతలు తేలేలా వైఎస్సార్సీపీ మూకలు దాడి చేసిన ఘటనలో బాధితుడిపైనే రివర్స్ కేసు పెట్టారు. దాడి చేసిన వారితో రాజీపడాలని, లేదంటే మీరే ఇబ్బంది పడతారంటూ నేరుగా పోలీసు ఉన్నతాధికారులే ఇన్‌స్పెక్టర్ కుటుంబ సభ్యులను హెచ్చరించారు. వారు వెనక్కి తగ్గకపోవటంతో బాధితులపైనే రివర్స్ కేసు పెట్టారు.
Anantapur District:అనంతపురం వైఎస్సార్సీపీ కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్, మరికొందరితో కలిసి గత ఆగస్టులో అనంతపురం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్‌పైకి దండెత్తారు. విధుల్లో ఉన్నమహిళా కానిస్టేబుల్, ఎస్సైపై దాడికి పాల్పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టినా ఆ తర్వాత తేలికపాటి సెక్షన్లతో మమ అనిపించారు. దాడికి పాల్పడ్డ కార్పొరేటర్‌ను అసలు నిందితుడిగానే చేర్చలేదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్‌ను, ఆమె భర్తను బెదిరించి 24 గంటల్లోగా ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేశారు.
Palnadu District:పల్నాడు జిల్లా ముప్పాళ్ల పోలీసుస్టేషన్‌ను రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టారు. పోలీసుల అదుపులో ఉన్న యువకుల్ని తమకు అప్పగించాలంటూ ఎస్సైతో వాదనకు దిగారు. ఆయన అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అయినా సరే ఆ దాడిచేసిన వారెవరిపైనా ఏ చర్యా తీసుకోలేదు ఓ మంత్రి ఒత్తిడితో వారినీ వదిలేశారు.
Anantapur Range DIG Ammi Reddy: పుంగనూరు ఘటనలో అల్లరిమూకను విడిచిపెట్టేది లేదు: డీఐజీ అమ్మిరెడ్డి