గుంటూరు జిల్లాకు చెందిన బాపారావుది.. అత్తోట గ్రామం. చదువు పూర్తయిన తరవాత.. గ్రాఫిక్ డిజైనర్‌గా ఉద్యోగం చేసేవాడు. అతడి కుటుంబంలో కొందరు కేన్సర్ బారిన పడి మృతి చెందారు. నిత్యం కష్టపడే రైతు కుటుంబాలు... రోగాల బారిన పడటం ఏంటనే ప్రశ్నలు అతడిని ఆలోచనల్లో పడేసింది. దీనికి ప్రధాన కారణం రసాయనాలతో కూడిన వ్యవసాయ విధానమని గ్రహించాడు.
అందులో భాగంగా.. ప్రకృతి సేద్యం గురించి అధ్యయనం చేసే సమయంలో దేశవాళీ విత్తనం గురించి తెలుసుకున్నాడు. విత్తన బ్యాంకులు, విత్తన పరిరక్షణ సంస్థలతో పాటు మరికొన్ని గ్రామాల నుంచి నాటురకం విత్తనాలు సమీకరించాడు. తనకున్న 25 సెంట్ల భూమినే ప్రయోగశాలగా మార్చుకున్నాడు.
ప్రకృతి సేద్యం చేయడం వల్ల గతంలో కంటే దిగుబడి తగ్గింది. అయినప్పటికీ... ఆ బియ్యం వండుకుని తినేటప్పుడు రుచిలో తేడా కనిపించింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికీ మంచిగా ఉపయోగపడుతుందని గమనించాడు. ఇదే స్ఫూర్తితో ఈ విధానాన్ని మరికొంత మంది రైతులకు పరిచయం చేశాడు.
అలా బాపారావు కౌలుకు తీసుకున్న 5 ఎకరాల పొలంలో.. దేశవాళీ వరి విత్తనాలు అభివృద్ధి చేశాడు. ఆ విత్తనాలను రైతులకు అందజేశాడు. వారు తమ పొలంలో ఎంతో కొంత విస్తీర్ణంలో దేశవాళీ వరి రకాలు పండించాలి. పంట వచ్చాక మరికొందరు రైతులకు ఆ విత్తనాలు అందజేయాలి. ఇలా నాలుగైదు రకాలతో ప్రారంభమైన దేశవాళీ విత్తన ఉద్యమం.. నేడు రెండు వందల రకాలకు చేరింది.