Atheist fair: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో 31వ జాతీయ నాస్తిక మేళా నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి నాస్తికులు భారీగా ఈ సమావేశానికి హజరైయ్యారు. దేవుడు పేరుతో కొందరు చేస్తున్న పనులతో అమాయక ప్రజలు మోసపోతున్నారని.. అలాంటి వారి కోసం, దేవుడు లేడని చెప్పడమే తమ విధానమని నాస్తిక సమాజం ప్రతినిధులు వెల్లడించారు. మూఢనమ్మాలకు మత పండుగలున్నాయని.. తమ లాంటి భౌతిక వాదులకు ఈ సమావేశాలే పెద్ద పండుగ అని నాస్తికులు చెప్పారు. తత్వశాస్త్రంలో దేవుడు ఉన్నాడని కొంతమంది.. లేడని మరి కొంతమంది వాదిస్తున్నారని నాస్తికులు చెప్పారు. దేవుడు లేడని చెప్పడానికే ఈ సమావేశాలు నిర్వహించుకుంటున్నామన్నారు. విజ్ఞానమే అసలైన దేవుడని చెప్పారు.
"దేవుడు ఉన్నాడని కొందరు.. లేడని కొందరు అంటున్నారు. కానీ ఈ వాదనలు మానవుడి పుట్టినప్పటి నుంచి లేవు. ఎప్పడు అయితే మానవుడు వ్యవసాయ దశ దాటి.. పట్టణీకరణ దశకు వచ్చినప్పటి నుంచి మొదలైన భావన ఇది. ఈ దైవ భావన, దైవ చింతన అనేది ఇతర జీవులకు ఉండదు. కేవలం మానవుడికి ఆలోచనా క్రమంలో వచ్చినది. ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చాలి. ఏదీ శాశ్వతమైన నిజం ఉండదు. ఏదీ శాశ్వతమైన అబద్ధం ఉండదు. కానీ నలుగురూ చర్చించుకోవడం.. ఒకరి దగ్గర నుంచి మరొకరు నేర్చుకోవడం అనేది జాతికి అవసరమైన అంశం. అందుకోసం నేను కూడా ఇందులో పాల్గొన్నాను". - డాక్టర్ జయకుమార్, నాస్తికుడు