రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళనలు Asha Workers Agitation In All Over Andhra Pradesh: ఉద్యోగ భద్రత, జీతాల పెంపు, అలవెన్సులు తదితర ప్రధాన డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ కార్యాలయాల వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఆశా కార్యకర్తలు వర్షాన్ని కూడ లెక్క చేయకుండా.. పలుచోట్ల వర్షంలోనూ వారి నిరసన కొనసాగించారు.
ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని, పనిభారం తగ్గించాలని కర్నూలులో ఆశావర్కర్లు డిమాండ్ చేశారు. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని కోరారు. గుంటూరులో వందల మంది కార్యకర్తలు డీఎమ్హెచ్వో కార్యాలయాన్ని ముట్టడించారు. ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు అప్పగిస్తున్నారని ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కమల మండిపడ్డారు. ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించకుంటే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.
"నాణ్యమైన ఫోన్లు ఇవ్వమని అడుగుతున్నాము. రెండు వేల రూపాయులు ఖరీదు చేసే ఫోన్లు ఇచ్చి.. ఆశా వర్కర్ నుంచి ప్రభుత్వం 10వేల రూపాయలు వసూలు చేసుకుంది. ఆశా వర్కర్ గర్భవతిగా ఉండి పనిచేయాల్సి వస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు." -కమల, రాష్ట్ర కార్యదర్శి, ఆశా కార్యకర్తల సంఘం
"కరోనా సమయంలో ఫ్రంట్ లైన్లో పనిచేసిన ఆశా కార్యకర్తలకు.. నేడు నెలల తరబడి జీతాలు ఇవ్వటం లేదు. కనీస వేతనం అమలు చేయటం లేదు. గౌరవ వేతనం ఇచ్చి వెట్టి చాకిరి చేయిస్తోంది ఈ ప్రభుత్వం. మాకు లీవ్‌లు లేవు. సంవత్సరం పొడవునా పని చేయాల్సిన పరిస్థితి ఉంది." -రమాదేవి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
అధికార పార్టీ నాయకుల వేధింపులు ఆపాలని, ప్రభుత్వ సెలవులు అమలు చేయాలని అమలాపురంలో ఆశా కార్యకర్తలు నినాదాలు చేశారు. అనకాపల్లిలో ఆశా కార్యకర్తల ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు డీఎంహెచ్ఓ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలని విజయనగరంలో ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. పార్వతీపురంలో జోరు వానలోనూ ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో జెండా పట్టుకుని నిరసన కొనసాగించారు. పనిభారం పెరగడంతో ఆందోళనకు గురవుతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
"పనిభారం పెరగటం వల్ల ఆశా కార్యకర్తలు ఆరోగ్యం క్షిణించి మరణిస్తున్నారు. కాబట్టి ప్రతి ఆశా వర్కర్‌కి గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి. 26వేల రూపాయలు కనీస వేతనం అందించాలి." -సుధారాణి, సీఐటీయూ నేత
"మాకు 24గంటలు పని అప్పగిస్తున్నారు. సర్వేలని, సచివాలయాల్లో పనులను పనిభారం పెంచుతున్నారు. అధికారులు, రాజకీయ నాయకుల నుంచి వేధింపులు ఆపాలి. పనిభారం తగ్గాలి. నాణ్యమైన సెల్ఫోన్లు అందించి ట్రైనింగ్ ఇవ్వాలి." -వి.సత్యవతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఆశా కార్యకర్తల సంఘం
అనంతపురంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టి.. మున్సిపల్ కార్యాలయం నుంచి వైద్యాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాప్‌ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెట్వర్క్ సరిగా పనిచేయని సెల్ ఫోన్స్ ఇచ్చి పని చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. యాప్‌ల పేరుతో ఆశ వర్కర్లపై ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడ్డారు.
ఈ ఆందోళన ఆరంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని.. అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఆశా కార్యకర్తలు వెల్లడించారు. సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.