శైవక్షేత్రాల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానిది ప్రత్యేకస్థానం. ఈ కొండపై త్రికోటేశ్వరునిగా శివయ్య దర్శనమిస్తాడు. త్రికూఠాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలిసినట్లు భక్తుల నమ్మకం. ఈశ్వరుడు మేధా దక్షిణామూర్తి స్వరూపంగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతోంది. దక్షయజ్ఞం తర్వాత ఈశ్వరుడు సతీవియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రిపై తపస్సు చేసుకుంటుండగా.. బ్రహ్మ, విష్ణువు, సకల దేవతలు స్వామివారి కటాక్షానికి ఇక్కడికి వచ్చి తపస్సు చేశారని భక్తుల విశ్వాసం. అందువల్ల త్రికూటాలపై ముగ్గురినీ భారీవిగ్రహల రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు.
విద్యుత్ ప్రభలతో రావడం ప్రత్యేకత..
ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. స్వామి కటాక్షానికి పొరుగు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున విద్యుత్ ప్రభలతో రావడం ప్రత్యేకత. 80 నుంచి 100 అడుగుల ఎత్తున నిర్మించే విద్యుత్ ప్రభలు వెలుగులు విరజిమ్ముతూ.. ఆధ్యాత్మికత పంచుతాయి. ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు.
పుర ఎన్నికల కారణంగా ఈసారి ఒకరోజు ముందుగానే ప్రభలను తరలించారు. రాత్రంతా జాగరణ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకే శివరాత్రి వచ్చిందంటే చిలకలూరిపేట, నరసరావుపేటలో పండగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.