Construction of Houses for Roor in Amaravati: రాజధాని అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గృహాల మంజూరు కోసం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం మంజూరు చేసిన తర్వాత నెలల వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం షియర్ వాల్ సాంకేతికతను వినియోగించాలని యోచిస్తోంది. ఈ విధానం ద్వారా 10 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి కానుంది. ఇప్పటికే విశాఖ, కోనసీమ జిల్లాల్లో ఈ సాంకేతికతతో గుత్తేదారులతో 150 గృహ నిర్మాణాలు పూర్తి చేశారు. గురువారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఇళ్ల నిర్మాణ అంశంపై చర్చ జరిగింది.
ఇదిలా ఉండగా.. రెండేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 18 లక్షల 64 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించినా.. ఇప్పటికి పూర్తైంది 20 శాతమే. ఇంకా 9 లక్షల గృహాలు పునాది దశలోనే ఉన్నాయి. 97 వేల మంది ఇంకా పనులే ప్రారంభించలేదు. ఆయా ప్రాంతాల్లో షియర్ వాల్ సాంకేతికతను ఉపయోగించకుండా.. వారి కర్మకు వారిని వదిలేశారు. అమరావతిలో మాత్రం ఆ విధానం వైపు సర్కారు మొగ్గుచూపడం విశేషం.
అమరావతిలో సెంటు చొప్పున బయటి ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. గృహ నిర్మాణాలు కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో ఇంటికి కేంద్రమిస్తున్న లక్షా 50 వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వమిచ్చే 30 వేలు, 35 వేలు పావలా వడ్డీ రుణం.. కలిపి మొత్తంగా 2 లక్షల 15 వేలతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు 3 ఐచ్ఛికాలు ఇస్తోంది.