నా ఇల్లును కూల్చేశారు...సీఎం జగన్మోహన్రెడ్డి గారు న్యాయం చెయ్యండంటూ ఓ ఆర్మీ జవాను వీడియో గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైరల్‌గా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటిని కూల్చారంటూ గోవిందరెడ్డి అనే ఆర్మీ జవాను వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. గత 18 ఏళ్లుగా ఆర్మీలో సేవలందిస్తూ...2010లో నరసరావుపేటలోని బరంపేటలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నానని తెలిపాడు. ఇటీవల మున్సిపల్ అధికారుల పేరు చెప్పి కొందరు వ్యక్తులు తన ఇంటిని పూర్తిగా కూల్చివేశారని ఆయన ఆరోపించారు. ఏ అధికారంతో తన ఇంటిని కూల్చారని మున్సిపల్ అధికారులను అడిగితే.. తాము కూల్చలేదని వారు తెలిపారన్నారు.
స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మంచి పేరు ఉందని.. ఆయన నా ఇల్లు కూల్చి ఉండరని భావిస్తున్నానన్నారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలంటూ శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. దేశాన్ని కాపాడేందుకు ఆర్మీలో కష్టపడుతున్న తాను.. నరసరావుపేటలో ఇంటిని కాపాడుకోలేకపోయానని జవాను గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తనకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించారు.
ఈ విషయంపై నరసరావుపేట మున్సిపల్ కమీషనర్ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా...ఆర్మీ జవాను గోవిందరెడ్డి కొనుగోలు చేసిన స్థలం ప్రభుత్వ భూమిగా తెలిపారు. అతనికి స్థలం అమ్మిన మధ్యవర్తులు ఆ స్థలానికి వేరే సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసి అతనిని మోసం చేశారన్నారు. ఆ స్థలం రజకుల ఖానా కింద కేటాయించి ఉందన్నారు. మున్సిపల్ అధికారులెవరూ ఆ ఇంటిని కూల్చలేదని తెలిపారు.