ఆర్మీ జవాను ఇంటి కూల్చివేతపై ఆర్మీ అధికారులు విచారణ చేశారు. ఇంటి కూల్చివేత విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంపై ముగ్గురు ఆర్మీ అధికారులను విచారణ నిమిత్తం గుంటూరు జిల్లా నరసరావుపేటకు పంపించారు. వారిలో కల్నల్ విక్రాంత్ సింగ్, మరో ఇద్దరు ఆర్మీ అధికారులు ఉన్నారు. నరసరావుపేటలో ఆర్మీ జవాన్ గోవిందరెడ్డి ఇంటిని కూల్చిన ప్రాంతానికి ఆర్మీ అధికారులు వెళ్లి విచారించారు. అనంతరం నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ను సంప్రదించి ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావును కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లగా డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లారు.
జవాన్ ఇల్లు కూల్చివేతపై ఆర్మీ అధికారుల విచారణ - ఆర్మీ జవాను ఇంటిపై దాడి చేసిన దుండగులు న్యూస్
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆర్మీ జవాన్ ఇల్లు కూల్చివేతపై ఆర్మీ అధికారులు విచారణ చేశారు. ఆర్మీ జవాన్ గోవిందరెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారుల పేరు చెప్పి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కూల్చివేయడంతో తనకు న్యాయం చేయాలంటూ సీఎం జగన్మోహన్రెడ్డికి జవాన్ సెల్ఫీ వీడియో తీసి పంపారు.
ఈ విషయమై సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ను ఈటీవీ సంప్రదించగా ఆర్మీ అధికారులు తన వద్దకు వచ్చి వివరాలు తెలుసుకున్నారన్నారు. ఆర్మీ జవాన్ ఇల్లు కూల్చివేత వ్యవహారం ప్రస్తుతం విచారణలో ఉందన్నారు. స్థానిక మున్సిపల్ అధికారులు ఇంటిని కూల్చివేశారని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. బయటి వ్యక్తులు ఇల్లు కూల్చారని తేలితే వారిపై చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు సిఫారసు చేస్తామని సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ వివరించారు.
ఇదీ చదవండి:'సీఎం ఏలూరు పర్యటనలో పెళ్లి వేడుకకే ప్రాధాన్యం ఇచ్చారు'