MINISTER PEDDIREDDY ON AQUA: రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల ధరల స్థిరీకరణపై ఏర్పాటైన సాధికారిక కమిటీ మరోమారు సచివాలయంలో సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఆక్వా సీడ్, ఫీడ్ ధరల ప్రభావం రైతులపై పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఆక్వా సాధికారిక కమిటీ.. ఉత్పత్తి వ్యయంను తగ్గించడం, ధరలను స్థిరీకరించడంపై దృష్టి సారించాలని సూచించింది.
రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం మార్కెట్లో ఆశించిన మేరకు రేటు లభిస్తోందని, దీనిని తరువాత రోజుల్లో కూడా కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ స్పష్టం చేసింది. ఆక్వా ఉత్పత్తుల రేట్లను అన్ని ఆర్బీకేల్లోనూ ప్రదర్శిస్తున్నామని, అలాగే రైతుల సమస్యలను తెలుసుకుని, తక్షణం వాటిని పరిష్కరించేందుకు కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు.
ఫీడ్ రేట్లను మరింతగా తగ్గించేందుకు వీలుగా ఫీడ్ తయారీదారులతోనూ సమావేశం నిర్వహించామని తెలిపారు. పూర్తిగా ఎగుమతులపైనే ఆధారపడటం వల్ల ఆక్వా రేట్లను స్థిరీకరించలేక పోతున్నామని, దేశీయంగా ఆక్వా ఉత్పత్తులు విక్రయించుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. దీని కోసం మార్కెటింగ్ కంపెనీల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది.