లాక్ డౌన్ కారణంగా ఏపీఎస్ఆర్టీసీ ఆర్ధికంగా చితికిపోయింది. రోజూ కోటిమందికి పైగా ప్రయాణికులను గమ్య స్థానాలకు తరలించే ఆర్టీసీకి రోజుకు 16 కోట్ల మేర రాబడి వచ్చేది. కరోనా వ్యాప్తి కారణంగా నెలన్నర రోజులుగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో సుమారు 800 కోట్ల రాబడిని కోల్పోయింది. లాక్ డౌన్ అనంతరం ఆర్టీసీకి గడ్డుకాలమే. కరోనా వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణికులను చేరవేయాల్సి ఉంటుంది. దీంతో బస్సులో సగం సీట్లతోనే నడపాలని నిర్ణయించింది. ఈ కారణంగా రాబడి రాకపోగా.. నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వని పరిస్ధితి ఉండటంతో.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ప్రయాణికుల రవాణా ద్వారా కోల్పోయిన ఆదాయాన్ని ప్రత్యమ్నాయ మార్గాల్లో రాబట్టుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఆర్టీసీ ఇప్పటికే పార్సిల్ సర్వీసును విజయవంతంగా నడుపుతోంది. లాభదాయకంగా ఉండటంతో దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్ధకు భవిష్యత్తులో మనుగడ సాగించాలంటే సరకు రవాణాను విస్తరించడమే ఏకైక మార్గంగా భావిస్తోంది.
సరకు రవాణాను మరింత విస్తరించాలని నిర్ణయించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను కార్గో ద్వారా 2 వేలకోట్ల రెవెన్యూ సాధించాలని ఆర్టీసీ లక్ష్యంగా నిర్ణయించి తగు చర్యలు తీసుకోవాలని అన్ని డిపోలు, రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. పెద్దఎత్తున సరకు రవాణాను చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆర్డర్లను సేకరించాలని నిర్ణయించింది. ఏపీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్ ఫెడ్, ఆగ్రోస్, పౌర సరఫరాల సంస్థ, ఏపీ బేవరేజ్ కార్పోరేషన్తోపాటు ఇతర శాఖలు, సంస్థలకు చెందిన సరకులను రవాణా చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఆర్టీసీకి ఆర్డర్ ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశాయి. దీంతో ఆర్టీసీ లాజిస్టిక్స్‌ను విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. సరకు తరలింపు కోసం వాహనాలను సమకూర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.