APSRTC got record level income: సంక్రాంతి అంటే ప్రైవేట్ ట్రావెల్స్‌కు పండగే అలాంటిది. ఈ సారి ఎపీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని అర్జించింది. గత సంవత్సరంతో పొల్చితే రూ.34 కోట్లు అధికంగా సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.
సంక్రాంతి పండుగ ఎపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ప్రయాణికులు విశేషంగా ఆదరిస్తుండటం వల్ల, ఆర్టీసీ కి లాభాల పంట పండింది. రద్దీ దృష్ట్యా ఈ నెల 6 నుంచే పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడంతో... ఈనెల 14 బోగి వరకే రికార్డు స్థాయిలో రాబడి ఆర్జించినట్లు ఎపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. కేవలం 9 రోజుల్లోనే 141 కోట్లు ఆదాయం ఆర్జించినట్లు సంస్థ తెలిపింది. రోజుకు సరాసరి 15.66 కోట్లు చొప్పున రాబడి ఆర్జించినట్లు పేర్కొంది. ఈనెల 6 నుంచి 14 వరకు రోజూ తిరిగే బస్సులకు అదనంగా 3392 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడిపినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై , బెంగళూరు సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య బస్సులను తిప్పినట్లు పేర్కొన్నారు. కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే 7.90 కోట్ల రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు.