ఇది రక్తమాంసాలతో వ్యాపారం కాదా కథనంపై వివరణ Vasudevareddy explanation on Liquor Revenue: ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తూ వీలైనంత ఎక్కువ ఆదాయం పిండుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వం.. మద్యంపై ఆదాయం పెరగడానికి సరికొత్త భాష్యం చెబుతోంది. 'ఇది రక్తమాంసాలతో వ్యాపారం కాదా?' శీర్షికన ఈనాడు ప్రధాన సంచికలో సోమవారం ప్రచురితమైన కథనాన్ని ఖండిస్తూ.. ఈ మేరకు.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా పరిగణించదని.. దాని ఉత్పత్తి, అమ్మకాలపై కఠిన నియంత్రణ వల్లే మద్యంపై ఆదాయం యాదృచ్ఛికంగా వస్తోందని అందులో ఆయన పేర్కొన్నారు. అమ్ముతున్న మద్యం పరిమాణం, విక్రయాల విలువ, తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని.. వైకాపా ప్రభుత్వం ఏటేటా పెంచుకుంటూపోవడాన్ని... కప్పిపుచ్చేందుకు ఏవేవో సంబంధం లేని విషయాలను.. ప్రకటనలో రాశారు. ప్రతిపక్ష నేత హోదాలో జగన్ హామీ ఇచ్చిన.. 'దశలవారీ మధ్య నిషేధం ప్రస్తావనే ఆ ప్రకటనలో లేదు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుంటూ వెళ్తామన్న ఊసేలేదు. పైగా మద్యంపై ఆదాయం యాదృచ్ఛికంగా వస్తోందంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
మద్యం ఆదాయాన్ని తగ్గించి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవాలన్న దుర్బుద్ధితోనే ప్రభుత్వంపై ప్రతిపక్షం విషప్రచారం చేస్తోంది.., మద్యం ద్వారా రాష్ట్రానికి డబ్బులు రాకూడదనేది ఈ పెద్దమనిషి ఉద్దేశమంటూ.. ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబును ఉద్దేశించి.. 2022 మార్చి 12న అసెంబ్లీలో మాట్లాడారు. మద్యం అమ్మకాల ద్వారా డబ్బులు వచ్చాయంటే.. అక్కచెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తారు.., ఆ మంచి జరగకూడదు.., అప్పులు పుట్టకూడదనే ఉద్దేశంతోనే.. మద్యంలో హానికారక పదార్థాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఆరోపణలు గుప్పించారు.
ఈ వ్యాఖ్యల్ని బట్టి.. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా పరిగణిస్తున్నట్లే కదా..! ఆ ఆదాయంతోనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అంగీకరించినట్లే కదా..! మరి.. రాష్ట్ర ప్రభుత్వం.. మద్యాన్ని ఆదాయ వనరుగా పరిగణించదని పేర్కొనడం జోక్ కాదా..? అసలు రాష్ట్రంలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నదే ప్రభుత్వం. ఏటేటా మద్యం విక్రయాల విలువ పెంచుకుంటూ పోవడం వల్లే కదా ఆదాయం లభిస్తుంది. మరి అది యాదృచ్ఛికం ఎలా అవుతుంది..? ఆదాయం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమైతే.., మద్యం విక్రయాల పరిమాణం, విలువ ఎందుకు తగ్గించుకుంటూ వెళ్లట్లేదు..?
సోమవారం నాటి ఈనాడు కథనంపై ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి ఇచ్చిన సమాధానాలు.. మరిన్ని ప్రశ్నలకు తావిస్తున్నాయి. 'మరింత తాగు.. మరింత ఆదాయం పిండుకో' అనేలా ప్రభుత్వ ఎక్సైజ్ విధానం ఉందనేది అబద్ధమని ప్రభుత్వం చెబుతోంది. వైకాపా అధికారం చేపట్టిన తర్వాత.. 2020-21 కంటే 2021-22లో 76.13 లక్షల కేసుల ఇండియన్ మేడ్ లిక్కర్, 24.52 లక్షల కేసుల బీర్లు అదనంగా అమ్మారు. 2021-22 కంటే 2022-23లో 71.27 లక్షల కేసుల ఐ.ఎమ్.ఎల్., 34.46 లక్షల కేసుల బీర్లు అదనంగా అమ్మారు.
దీన్ని.. మరింత తాగించడం అనకపోతే.. మరేమంటారు..? వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మినహా.. ఏటా మద్యం విక్రయాల విలువ పెరుగుతూనే ఉంది. 2020-21తో పోలిస్తే 2021-22లో 4 వేల 834 కోట్లు, 2021-22తో పోలిస్తే.. 2022-23లో 3 వేల 700 కోట్ల రూపాయల విలువైన మద్యం అదనంగా అమ్మారు. ఇది మరింత ఆదాయం పిండుకోవడం కాకపోతే.. మరేంటి..? తెలుగుదేశం హయాంలో ఐదేళ్లలో.. 75 వేల 285.97 కోట్ల విలువైన మద్యం అమ్మగా.. 2019 ఏప్రిల్, మే నెలలు మినహా.. వైకాపా అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలోనే 94 వేల 240 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని అమ్మారు. ఇది మరింత తాగించడం, మరింత ఆదాయం పిండుకోవడం కాకపోతే మరేంటి..?
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాల అమలు కోసం.. నిధుల సమీకరణకు వీలుగా.. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు-ఎన్సీడీలను జారీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. మద్యం అమ్మకాల ద్వారా లభించే ఆదాయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాలను కాపాడేలా సంక్షేమ పథకాలకు వినియోగిస్తాం.., చేయూత, ఆసరా, అమ్మఒడి పథకాల బాధ్యత.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అప్పగిస్తున్నామంటూ.. ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ప్రజల్లోని తాగుడు బలహీనతను అడ్డం పెట్టుకుని ఆదాయాన్ని పిండుకోవడమే కాక.. ఆ రాబడినే హామీగా చూపించి వేల కోట్లు రుణాలు తేవడమేంటి..?
అదే డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ చట్టాల్నే సవరించుకోవడమేంటి..? ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తూ.. ఆ సొమ్మునే సంక్షేమ పథకాల పేరిట ఇవ్వడాన్ని ఏమనాలి..? ఏపీఎస్‌బీసీఎల్.. బాండ్లు వేలం వేసి ఇప్పటికే 10 వేల 5 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చింది. ఆ అప్పులు తీర్చాలంటే వ్యాపారాన్ని విస్తరించాలి. మద్యం అమ్మకాల ద్వారా మరింత ఆదాయం పెంచుకోవాలి. దీన్ని బట్టి ప్రజలతో మరింత తాగించి.. మరింత ఆదాయం రాబట్టుకుని.. తద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది.. ప్రభుత్వ విధానమనేది స్పష్టమవుతోంది కదా..!
మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకే అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను-ఏ.ఆర్.ఈ.టీ. విధించామని.. దీని వల్లే ధరలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది. విక్రయ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ ఏ.ఆర్.ఈ.టీ. వల్ల విక్రయ విలువ పెరిగిందన్నది వైకాపా సర్కారు వాదన. ప్రభుత్వం చెబుతున్నట్లు.. మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకే ఏ.ఆర్.ఈ.టీ. విధిస్తే.. దాని వల్ల మద్యం విక్రయాల పరిమాణం తగ్గాలి కదా..! ఎందుకు పెరిగింది..? ఓ వైపు కొత్త పన్నులు విధించి.. తద్వారా మద్యం ధరలు పెంచేసి.. మరోవైపు విక్రయాల పరిమాణం పెంచుకోవడం..! ఈ రెండూ ప్రభుత్వ ఆదాయం పెంచుకునే పద్ధతులు కాకపోతే మరేంటి..? ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాల్లో పెరుగుదల, ఏ.ఆర్.ఈ.టీ. వల్లే స్టేట్ ఎక్సైజ్ పద్దు కింద ప్రభుత్వానికి వసూళ్లు పెరిగాయని.. కాగ్ కూడా నివేదికలో ప్రస్తావించింది.
ఇది.. మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరుస్తున్నామన్న ముసుగులో ఆదాయాన్ని పెంచుకోవడం కాకపోతే మరేంటి..? మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉంటే వినియోగం తగ్గుతుందని.. తొలుత ధరలు భారీగా పెంచారు. అప్పుడు అమ్ముడైన మద్యం పరిమాణం తగ్గినా... ప్రభుత్వానికి ఆదాయం తగ్గట్లేదు. ఇప్పుడు ధరలు తగ్గించిన తర్వాత అమ్మడవుతున్న మద్యం పరిమాణంతో పాటే ఆదాయమూ పెరిగింది. అంటే ధరలు పెంచినా, తగ్గించినా.. ప్రభుత్వం ఆదాయం పెరుగుతూనే ఉంది.
మద్యం దుకాణాలు గతంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకూ తెరిచి ఉండేవి.., ఇప్పుడు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు తగ్గించామని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి.. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని.. 2019 అక్టోబరులో పేర్కొన్న ప్రభుత్వం... తర్వాత రాత్రి 9 గంటల వరకూ పొడిగించింది. కొవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని... అకౌంటింగ్ ప్రక్రియ కోసం.. రాత్రి 10 గంటలకూ దుకాణాలు తెరిచి ఉంచడానికి అనుమతిస్తున్నట్లు.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దుల్లో ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఇది మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను పెంచడం కాదా..?
బార్‌ల సంఖ్య పెంచలేదు.. 2017-22 మధ్యనున్నవే ఇప్పుడూ ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. దశలవారీ మద్య నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే.. బార్లు రద్దు చేయాలి. అలా చేయలేదు సరికదా.. ఏకంగా మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్ల విధానాన్ని ఖరారు చేయడాన్ని ఏమనాలి..? ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం 2024 మే వరకే ఉంది. కానీ గతేడాది వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ల విధానం కాలపరిమితి 2025 ఆగస్టు 31 వరకూ ఉంది. ఇది తమ హయాంలో మద్యనిషేధం ఉండదని చెప్పడం కాదా..? 2024 నాటికి స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తామని ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చెప్పిన మాటలు ఒట్టివేనని తేటతెల్లం కావట్లేదా..? బార్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించడం మద్యం విక్రయాలు పెంచుకోవడానికి కాకపోతే మరెందుకు..?
ఇవీ చదవండి: