అధికారపార్టీ ఓట్ల దొంగలను రక్షిస్తున్న పోలీసులు - అర్హుల ఓట్ల తొలగింపునకు వైసీపీ సానుభూతిపరుల ధరఖాస్తులు Application for Deletion of Eligible Votes: 2019 ఎన్నికలకు ముందు లక్షల సంఖ్యలో అర్హుల ఓట్లు తొలగించాలంటూ కుట్రపూరితంగా దరఖాస్తులు చేసిన వారిని.. పోలీసులు ఇప్పటికీ గుర్తించలేకపోయారు. ఇందుకు వారు చెప్పే కారణం ఐపీ అడ్రస్‌లు తెలియలేదని. దరఖాస్తులు చేసిన వారు వైసీపీ సానుభూతిపరులు కావడంతో అత్యధిక కేసుల్ని పోలీసులు మూసేశారు. అంతిమంగా వైసీపీ ఓట్ల దొంగలను రక్షించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో అర్హుల ఓట్లు తొలగించేందుకు భారీ కుట్ర జరిగింది. 2019 జనవరి 11 తర్వాత ఎన్నికల సంఘానికి 12.50 లక్షల ఫారం-7 దరఖాస్తులొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (ఎన్‌వీఎస్‌పీ) ద్వారా గంపగుత్తగా కొందరు ఫారం-7 దరఖాస్తులు చేశారు. వాటిలో దాదాపు 9.50 లక్షల దరఖాస్తులు ఫిబ్రవరి చివరి వారంలోనే అందాయి.
టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్రలు - మౌనం వహించిన ఎన్నికల సంఘం!
ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులతో పరిశీలన జరిపించగా.. వాటిలో 1.41 లక్షల మందే అనర్హులున్నట్లు తేలింది. మిగతా 11 లక్షలకు పైగా దరఖాస్తులు అర్హుల ఓట్లు తొలగించాలంటూ వచ్చినవే. వాటిలో అత్యధికం కుట్రపూరితంగా చేసినవేనని గుర్తించిన ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసింది. ఆ దరఖాస్తులు చేసిన వారిలో 80 శాతానికి పైగా వైసీపీ సానుభూతిపరులు ఉన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో దర్యాప్తు పక్కకు పోయింది. సిట్ నివేదికా మూలనపడింది.
ఈ దరఖాస్తుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 19,225 ఓట్ల తొలగింపు కోసం రాగా.. అధికారుల పరిశీలనలో వాటిలో 18,858 మంది అర్హులేనని తేలింది. రాప్తాడు నుంచి 9,748, గురజాల నుంచి 7,859, భీమిలి నుంచి 7,815, అనపర్తి నుంచి 7,358.. ఇలా అనేక నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులొచ్చాయి.
వైసీపీ ఎమ్మెల్యే తల్లి చనిపోయి ఐదేళ్లైనా తొలగించని ఓటు - పైగా రెండు చోట్ల
ఐదు వేలకు పైగా దరఖాస్తులొచ్చిన నియోజకవర్గాలు 31. రాజాం నుంచి 5,716 దరఖాస్తులు రాగా.. అనర్హులైన ఓటరు ఒక్కరేనని తేలింది. దీనిని బట్టి అది ఎంత పెద్ద కుట్రో అర్థమవుతోంది. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదల్లేని వ్యక్తులు, చనిపోయిన వారి పేరిటా అప్పట్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులొచ్చినట్లు సిట్ గుర్తించింది. ఎప్పటి నుంచో ఒకే చిరునామాలో నివసిస్తున్న వ్యక్తుల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించాలని పెద్దసంఖ్యలో అర్జీలు అందినట్లు నిగ్గు తేల్చారు.
తప్పుడు దరఖాస్తులు చేసినవారిలో కొందర్ని గుర్తించి పోలీస్‌స్టేషన్లకు పిలిచి విచారించారు. వారిలో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 25 కేసులకు సంబంధించి 459 మందిని గుర్తించగా, వీరిలో 413 మంది వైసీపీ సానుభూతిపరులు. విజయనగరం జిల్లాలో 140 మందిలో 123 మంది, విశాఖపట్నం గ్రామీణ జిల్లాలో 21లో 19 మంది, రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో 58లో 45 మంది, కృష్ణా జిల్లాలో 108లో 65 మంది వైసీపీ సానుభూతిపరులని తేలింది. 80 శాతానికిపైగా వైసీపీ సానుభూతిపరులు కాబట్టే కేసుల్ని నిర్వీర్యం చేశారని అర్థమవుతోంది.
Lakhs of Voters Removed in Andhra Pradesh: లక్షల్లో ఓట్లు గల్లంతు.. వైసీపీ కుట్రలో భాగమేనా..!
2019 ఎన్నికలకు ముందు గంపగుత్తగా వచ్చిన ఫారం-7 దరఖాస్తులకు సంబంధించిన కేసుల్లో నిందితుల్ని ఇప్పటికీ గుర్తించలేకపోవడంపై.. ఎన్నికల సంఘం, పోలీసులు ఒకరిపైకి మరొకరు నెపాన్ని నెట్టుకుంటున్నారు. కేసుల్లో దర్యాప్తు పురోగతి ఏమిటో చెప్పాలంటూ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ మీనా సెప్టెంబరు 14న లేఖ రాశారు. మొత్తం 438 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసులు ఏమయ్యాయని ఆరా తీయగా.. అందులో తొమ్మిది జిల్లాల పరిధిలో వివరాలున్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 9జిల్లాల పరిధిలోని 127 కేసుల్ని పరిశీలించగా.. వాటిలో 107 కేసుల్ని ‘అన్ డిటెక్టెడ్ ’ పేరుతో మూసేసినట్లు వెల్లడైంది. 8 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని, 10 కేసుల్ని రీఎసైన్ చేశామని పోలీసు రికార్డుల్లో ఉంది. ఇతర కారణాలతో దర్యాప్తు కొలిక్కిరాని కేసులు మరో రెండు ఉన్నాయి.
సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన నేరాల్ని తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ఈ కేసుల్ని ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోలేదు. మీనా ముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులుగా ఉన్నవారు ఏం చేశారు. అనే ప్రశ్నలు వస్తున్నాయి. ‘ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌కు దరఖాస్తులొచ్చిన ఐపీ అడ్రస్‌లు, మ్యాక్ అడ్రస్‌లు, ఐఎంఈఐ నంబర్ల వివరాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయాన్ని కోరామని.. కానీ ఇంతవరకూ స్పందన లేదని ఓ జిల్లా ఎస్పీ నివేదికలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుల్ని పట్టుకోవడం కష్టమని.. భవిష్యత్తులో ఏమైనా ఆధారాలు లభిస్తే కేసును రీ ఓపెన్ చేస్తామని కేసులపై మరో జిల్లా ఎస్పీ ఈ ఏడాది అక్టోబరు 17 నాటి స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నారు.
Removal Votes in Parchur: పర్చూరు ఓట్ల దొంగలపై చర్యలకు అధికారులు మీనమేషాలు