Bopparaju Venkateswarlu Comments: జీతాలు ఒకటో తేదీన ఇచ్చే పరిస్థితి లేకుండా ఉందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 30 శాతం పెంచాలని పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసినా రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం కూడా పెంచలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 50 శాతం మేర వేతనాలు పెంచారని బొప్పరాజు తెలిపారు.
ఉద్యోగులు వేరు కాదు.. ప్రభుత్వంలో భాగస్వామి అన్నప్పుడు ఆర్ధిక శాఖ తమకు లెక్కలు ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు. ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. ఉద్యోగుల వేతనాలు సరైన సమయానికి ఖాతాల్లో జమ అవుతున్నాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఏ మొత్తాన్ని జమ చేస్తున్నారు.. ఏ మొత్తాన్ని వెనక్కు తీసుకుంటున్నారో అర్ధం కావటం లేదన్నారు.
వీఆర్ఏ లాంటి చిన్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వం డీఏను చెల్లించలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు.. తమ కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనివల్ల తమ పిల్లల పెళ్లిళ్లు కూడా వాయిదా పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఎంతగానో ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నారని అన్నారు. కానీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతోందని తెలిపారు.