వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటం వల్ల రైతులకు ఎలాంటి నష్టం లేదని ఏపీసీపీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరక్టర్ పద్మా జనార్థనరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో ఆయన పర్యటించారు. వైఎస్.ఆర్ వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకంపై రైతులకు అవగాహనా సదస్సులో పాల్గొన్నారు. మీటర్లు బిగించటం కేవలం విద్యుత్ సరఫరా లెక్కింపు కోసమేనని స్పష్టం చేశారు. తద్వారా వినియోగానికి తగిన రీతిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, లైన్లు ఏర్పాటు చేయవచ్చన్నారు.
రాష్ట్రంలో సౌరవిద్యుత్ ఉత్పత్తిని 10వేల మెగావాట్లకు విస్తరిస్తున్నందున.. రాబోయే 30 ఏళ్లలో వ్యవసాయ విద్యుత్ కు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. సెంట్రల్ డిస్కం పరిధిలో విద్యుత్ నగదు బదిలీ పథకం అమలు కోసం జిల్లా నుంచి మండల స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతుల సందేహాలు తీర్చేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలన్నారు.