ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Temperatures: నిలిచిపోయిన రుతుపవనాలు.. భగ్గుమంటున్న ఎండలు మరో 2 రోజులు ఇదే పరిస్థితి! - AP weather news

Temperatures in AP: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా లేకపోవటం, ముందుకు విస్తరించకపోవటంతో జూన్ నెల వచ్చినా ఎండలు మండుతున్నాయి. ఈ నెల 11 తేదీ వరకు ఏపీలోని శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి, మహారాష్ట్ర వరకూ విస్తరించిన నైరుతి పవనాలు.. ప్రస్తుతం ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలోనూ అధికవేడి నెలకొంది. ఈ నెల 18 తర్వాత కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Temperatures
నిలిచిపోయిన రుతుపవనాలు.. భగ్గుమంటున్న ఎండలు మరో 2 రోజులు ఇలానే

By

Published : Jun 16, 2023, 4:12 PM IST

Temperatures in AP: బిపర్ జాయ్ తుపాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నెల 11 తేదీ వరకూ కాస్త నెమ్మదిగానే విస్తరించిన నైరుతి ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు పురోగమించలేదని భారత వాతావరణ విభాగం తెలియజేస్తోంది. ఈ నెల 11 తేదీ నాటికి ఏపీలోని శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి, మహారాష్ట్ర వరకూ విస్తరించిన నైరుతి పవనాలు అక్కడే నిలిచిపోయినట్టు వాతావరణశాఖ స్పష్టం చేస్తోంది. వాస్తవానికి ఈ సమయానికే దేశంలోని ముప్పావువంతు భాగానికి విస్తరించాల్సిన నైరుతి పవనాలు ముందుకు కదలకుండా నిలిచిపోయాయి.

రెండు రోజులు అధికంగా హీట్ వేవ్ పరిస్థితులు.. నైరుతి రుతుపవనాలు క్రియాశీలంకంగా లేకపోవటంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొన్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేస్తోంది. ఈ నెల దేశంలోని వివిధ ప్రాంతాల్లో హీట్​ వేవ్ కొనసాగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్​లోని కోస్తా, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రంలోనూ హీట్ వేవ్ కారణంగా అసాధారణంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వర్షాకాల సీజన్ మొదలైనా ఇంకా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు ఎండలతో సతమతం అవుతున్నాయి. ఏపీలోనే దాదాపు 231 మండలాల్లోతీవ్ర స్థాయిలో వేడిమి పరిస్థితులు నెలకొన్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేస్తోంది.

రాగల రెండు రోజుల్లోబాపట్ల, కృష్ణా, పల్నాడు, పశ్చిమగోదావరి, విశాఖ, కోనసీమ జిల్లాల్లో తీవ్రస్థాయిలో హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే నెల్లూరు, ప్రకాశం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి, అల్లూరి, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని పేర్కోంది. ఈ నెల 18వ తేదీ తర్వాత రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలియచేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు..ఇక రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాధారణం కంటే 5-7 డిగ్రీల మేర అదనంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టు వాతావరణశాఖ చెబుతోంది. హీట్ వేవ్ పరిస్థితులకారణంగా అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట 44.47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మన్యం జిల్లా సాలూరులో 44.44 డిగ్రీలు, విజయనగరం జిల్లాలోని గంట్యాడ, బాపట్ల, ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో 44.43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.

శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, అనకాపల్లి, ఎన్టీఆర్, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణశాఖ తెలిపింది. కాకినాడ, కృష్ణా, ప్రకాశం, ఏలూరు, అల్లూరి, తిరుపతి, నెల్లూరు , నంద్యాల, గుంటూరు జిల్లాల్లో 42 డిగ్రీల సెల్సియస్ రికార్డు అయ్యింది. తీవ్రమైన వేడిమి పరిస్థితుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు తీవ్రంగానే 40 డిగ్రీలకంటే అధికంగానే నమోదు అవుతున్నాయి. రుతుపవనాలు కదలని కారణంగా సుదీర్ఘ వేసవి రాష్ట్రంలో నమోదు అవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details