AP Tops Southern States in Attacks on Dalits: ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ సభ పెట్టినా నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ గొంతుచించుకుని అరవడం, తనను తాను దళిత, గిరిజన బాంధవుడిగా కీర్తించుకోవడమే తప్ప ఆయన పాలనలో అణగారిన వర్గాలపై జరుగుతున్న దమనకాండను మాత్రం నిలువరించలేకపోయారు. వైసీపీ పాలనలో వారానికి నలుగురు దళితులు దారుణ హత్యలకు గురవుతున్నారు. ఆరుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు.
రోజుకు కనీసం ఇద్దరు దాడుల బాధితులవుతున్నారు. వారానికి ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. దళితులపై సగటున రోజుకు ఆరు నేరాలు జరుగుతున్నాయి. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలలో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశే అగ్రస్థానంలో కొనసాగుతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ నేర గణాంక సంస్థ (National Crime Records Bureau) విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడైంది. దేశంలో దళితులపై జరుగుతున్న నేరాల్లో నేరాల్లో ఏడో స్థానం, గిరిజనులపై నేరాల్లో ఎనిమిదో స్థానంలో ఏపీ నిలిచింది.
Anarchies on Dalits: అధికార వైఎస్సార్సీపీ పాలనలో.. దళిత, గిరిజనులపై అరాచకాలు.. నెలకు ముగ్గురి హత్య
2021తో పోలిస్తే 2022లో రాష్ట్రంలో దళితులపై నేరాలు 14.5 శాతం, గిరిజనులపై 9.7 శాతం పెరిగాయి. దళితులపై నేరాల రేటు 2021లో 23.8 శాతం ఉండగా ఒక్క ఏడాది వ్యవధిలోనే 27.4 శాతానికి చేరింది. గిరిజనులపై నేరాల రేటు 13.8 శాతం నుంచి 15.1 శాతానికి ఎగబాకింది. గతేడాది దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై జరిగిన నేరాల్లో నాలుగుదేశం రాష్ట్రంలోనే చోటుచేసుకోవడం విచారకరం. మన కన్నా పెద్దరాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక కన్నా ఏపీలోనే దళితులపై అఘాయిత్యాలు ఎక్కువ చోటుచేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.