అంతరిక్ష శాస్త్రవేత్తగా లక్ష్మీప్రియాంకకు అరుదైన గుర్తింపు అన్ని రంగాలతో పోల్చిచూస్తే అంతరిక్ష పరిశోధనల వైపు వెళ్లే విద్యార్థులు చాలా తక్కువగా ఉంటారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన లక్ష్మీ ప్రియాంకకు అంతరిక్షశాస్త్రంపై మొదటి నుంచీ ఆసక్తి. అదే ఇష్టంతో ఈ రంగంలో అడుగు పెట్టింది. అంతరిక్ష శాస్త్రవేత్తగా అరుదైన గుర్తింపు దక్కించుకుంటోంది.
ప్రియాంక లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే ప్రియాంక.. కేరళ తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీటు సాధించింది. 156 సీట్లే ఈ సంస్థలో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షలమంది పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ సంయుక్త ప్రతిభా ప్రాతిపదికగా 2014లో ప్రతిష్ఠాత్మక సంస్థలో సీటు సంపాదించిన లక్ష్మీప్రియాంక అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు.
మొదట్లో భయపడిన ప్రియాంక... కష్టాన్నే ఇష్టంగా మార్చుకుంది. అలా తొలి మూడేళ్ల బీటెక్ తర్వాత మూడేళ్లు ఎంఎస్ కోర్సు 8.29 మార్కుల గ్రేడుతో ఉత్తీర్ణత సాధించింది. లక్ష్యసాధనలో ఒక్కో అడుగు అధిగమించిన లక్ష్మీ ప్రియాంక.. ఈ మధ్యకాలంలో ఎన్నో పరిశోధనలు చేసింది. ఆటమ్ చిప్ పెరోవిటీలో ఉత్తమ పరిశోధన పోస్టర్లు రూపొందించింది. ఈ ఏడాది మేలో డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో సంయుక్త ఆధ్వర్యంలో ఐఐఎస్టీలో నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా యువ శాస్త్రవేత్తగా ఎంపికైంది.
చంఢీగడ్‌లోని ఇస్రో సెమీ కండక్టర్స్ లేబరేటరీలో ఇకపై బాధ్యత నిర్వర్తించనుంది ప్రియాంక. ఉపగ్రహాల్లో ఉపయోగించే కీలకమైన చిప్‌ల పరిశోధన, రూపకల్పన విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తలతో కలిసి పని చేయనుంది ఈ తెలుగమ్మాయి.
చిన్నప్పటి నుంచీ సైన్స్, స్పేస్ టెక్నాలజీ పట్ల ఆమెలోని ఆసక్తే... ప్రియాంకను విజయతీరాలకు చేర్చిందంటున్నారు తల్లిదండ్రులు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం దరి చేరుతోందంటోంది ప్రియాంక. ఆసక్తితో అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కదిలితే అంతరిక్ష రంగంలో అడుగుపెట్టచ్చోంటోంది.