పవన్ కల్యాణ్‌పై కేసు... నమోదు దిశగా పోలీసులు..! జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు దిశగా పోలీసులు సిద్ధమవుతున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా.. మంగళవారం.. పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం 144 సెక్షన్, 30 పోలీస్ చట్టం అమల్లో ఉంది. ఇవి అమల్లో ఉన్నప్పుడు గుంపులుగా వెళ్ళటం, అనుమతి లేకుండా ర్యాలీలు చేయటం చట్టరీత్యానేరం. పవన్ తన పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించి... పోలీసులు వేసిన ఇనుప కంచె దాటి వెళ్లారని,. రైతులు, జనసేన కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. న్యాయ సలహా తీసుకుంటున్న పోలీసులు
రైతులకు సంఘీభావం తెలిపే క్రమంలో పోలీసులు విధించిన నిబంధనలు పవన్ ఉల్లంఘించారని భావిస్తున్నారు. వీటితో పవన్‌పై కేసు నమోదు చేసేందుకు గుంటూరు గ్రామీణ పోలీసులు చర్యలు చేపట్టారు. మీడియాపై దాడి కేసులో రైతులపై పెట్టిన కేసులు, సెక్షన్ల విషయంలో.. కోర్టులో అభ్యంతరాలు రావడం, వివిధ వర్గాల ప్రజల నుంచి విమర్శలు రావటంతో ఈసారి అలా కాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. అందుకే పవన్‌పై కేసు నమోదు విషయంలో న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. పోలీసులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇనుప కంచె దాటి వెళ్లడం... ఎలాంటి అనుమతి లేకుండా పాదయాత్ర చేయడం, గుంపులుగా వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించి కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం.
కేసు పెడితే రాజధాని గ్రామాల్లో అలజడి
న్యాయ సలహా అనంతరం ఈ విషయంలో పోలీసులు ముందుకు వెళ్ళనున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్న కొందరిని వీడియో దృశ్యాల ఆధారంగా గుర్తించారు. వారందరిపైనా పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో కేసులు పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్‌పై కేసులు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వీటిని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు తోసిపుచ్చారు. పవన్‌పై ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. కేసులు పెడితే రాజధాని గ్రామాల్లో అలజడి మరింతగా పెరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగని కేసులు పెట్టకుండా మౌనంగా ఉంటే ఆందోళనలు నియంత్రించటం సాధ్యం కాదని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. న్యాయ సలహా మేరకు కేసు నమోదు చేయాలా వద్దా.. ఒకవేళ చేస్తే ఎవరెవరిని బాధ్యులను చూపాలి... ఎలాంటి సెక్షన్లు నమోదు చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి :
ముళ్లకంచె ఛేదించి... మందడం రైతులను కలిసిన జనసేనాని