తెలంగాణ మంత్రి హరీశ్‌కు ఏపీ మంత్రి కారుమూరి కౌంటర్ Karumuri Counter to Harish: ఆంధ్రప్రదేశ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. తెలంగాణ మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. ఏపీ గురించి మాట్లాడుతున్న హరీశ్ ఏపీకి వచ్చి.. ఇక్కడ జరుగుతున్నవి తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. తెలంగాణ, ఏపీ పాలనకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ కార్మికులను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు.. ఏపీలో ఎందుకు, అక్కడ ఓట్లను రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోండని చేసిన వ్యాఖ్యలపై కారుమూరి మండిపడ్డారు.
ఈ క్రమంలో బుధవారం మాట్లాడిన కారుమూరి.. మంత్రి హరీశ్‌కు చురకలంటించారు. ఏపీ సీఎం జగన్ అన్నిరంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తుంటే.. చూసి తట్టుకోలేక హరీశ్ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆక్షేపించారు. హైదరాబాద్‌లో ఒక్క వర్షం కురిస్తే చాలు కుప్పకూలిపోతుందని, ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తాయి అని వ్యాఖ్యానించారు. అక్కడ ఇటీవల ఈ పరిస్థితి వచ్చినప్పుడు కొంతమందికి పరిహారంగా రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తే.. మరికొంతమందికి ఇవ్వనేలేదని కారుమూరి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌ను అంత ఘోరంగా చేసింది మీరేనని, అక్కడ రోడ్లు వేస్తే అయిపోయిందా..? తెలంగాణలోని గ్రామాల్లో మీ రోడ్ల సంగతి చూసుకోండని ధ్వజమెత్తారు. ఏపీలో గ్రామాలకే మేము ఫ్యామిలీ డాక్టర్ విధానాన్నితీసుకొచ్చాం అని తెలిపిన ఆయన.. జీఎస్డీపీ విషయంలో దేశంలో మేం నంబర్-1గా ఉన్నామని హర్షం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఏపీ గ్రామ సచివాలయాల్లో 1.36 లక్షల మంది ఉద్యోగులు సేవలందించగా.. వారితో పాటు 2.56 లక్షల మంది వాలంటీర్ల ఏర్పాటుతో రాష్ట్రంలో వృద్ధులెవరూ కాలు బయటపెట్టకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛను ఇస్తున్నామని తెలిపారు.
నాడు-నేడు కింద పాఠశాలల్లో పిల్లలకు ఇస్తున్న దుస్తులు, పుస్తకాలు, బైజూస్ యాప్‌తో కూడిన ట్యాబ్‌లు, ఆహారం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే మీకే తెలుస్తుందని కారుమూరి హరీశ్‌పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు వేసే వారికే సేవ చేస్తే.. ఏపీలో మా ముఖ్యమంత్రి ఓటు హక్కు లేని చిన్నారులకు కూడా సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. దీంతోపాటు మీకు ఎన్ని లోపాలు ఉన్నాయో, రాష్ట్రాన్ని మీరెలా తగలేశారో మీ ప్రతిపక్షాలే చెబుతున్నాయని హరీశ్‌ను కారుమూరి ఎద్దేవా చేశారు. ముందు వాటన్నింటికీ సమాధానం చెప్పుకోండని విమర్శించారు. దీంతోపాటు మీది ధనిక రాష్ట్రం అని.. మొత్తం అభివృద్ధిని, ఉమ్మడిరాష్ట్ర సచివాలయాన్ని, పరిశ్రమలు అన్నింటినీ మీకే అప్పజెప్పి.. ఆదాయమంతా మీకే వచ్చేలా చేసిన చంద్రబాబు దయవల్ల మేము చెట్టుకింద కూర్చోవాల్సి వచ్చిందని హరీశ్‌కు కౌంటర్ ఇచ్చారు. అయినా కూడా రాష్ట్రాన్ని జగన్ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారని కారుమూరి వ్యాఖ్యానించారు.
"ఏపీ సీఎం జగన్ అన్నిరంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే.. చూసి తట్టుకోలేక తెలంగాణ మంత్రి హరీశ్ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారు. ఏపీకి వచ్చి ఇక్కడ జరుగుతున్నవి చూసి.. కాస్త బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలి." - కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ మంత్రి
ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని: తన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు రాద్దాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు. ఏపీకి చెందిన పలువురికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని.. అలా ఉంటే ఇక్కడే ఓటు ఉంచుకోవాలని చెప్పానని ఆయన వివరించారు. తెలంగాణలో ఏముందో ఇక్కడికి వచ్చి చూస్తే వారికే అర్థమవుతుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో భారాస ఆత్మీయ సమ్మేళనంలో బుధవారం పాల్గొన్న హరీశ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడట్లేదని హరీశ్ అన్నారు.
ఇవీ చదవండి: