HC RESERVED THE JUDGEMENT ON GO ONE : షరతుల పేరుతో గొంతెత్తకుండా చేయాలనుకోవడం.. అప్రజాస్వామికమని జీవో నంబర్-1ను సవాల్ చేసిన పిటిషనర్లు.. హైకోర్టులో ఆక్షేపించారు. సభలు, సమావేశాల నియంత్రణ పౌరుల ప్రాథమిక హక్కులు హరించడమేనని.. ప్రభుత్వ జీవో చట్ట విరుద్ధమని వాదించారు. పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చిన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్.. లోకేశ్ పర్యటనకు అనుమతిచ్చామని తెలిపారు. వాద, ప్రతివాదనలు విన్న హైకోర్ట్.. జీవో నంబర్-1పై వారంలో తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది.
జీవో 1ను సవాల్ చేస్తూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతోపాటు టీడీపీ నేత కొల్లు రవీంద్ర, పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు,.. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు వేసిన వ్యాజ్యాలపై.. హైకోర్టులో వాదనలు ముగిశాయి. ర్యాలీలు, సమావేశాల నియంత్రణ విషయంలో.. పోలీసు చట్టంలోని సెక్షన్-3ను ఆసరాగా చేసుకొని.. పోలీసులకు ఆదేశాలిచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. సెక్షన్ 30 ప్రకారం ఆ అధికారం డీజీపీ, ఎస్పీలకు మాత్రమే ఉంటుందన్నారు.
కార్యక్రమాలకు అనుమతి ఇవ్వండి, ప్రత్యేక పరిస్థితులుంటే నిరాకరించండి.. అని పోలీసు చట్టం సెక్షన్ 30 చెబుతుంటే.. జీవో నంబర్-1 అందుకు భిన్నంగా ‘అనుమతి నిరాకరించండి, ప్రత్యేక పరిస్థితులుంటేనే అనుమతించండి.. అని చెబుతోందని ఆక్షేపించారు. ప్రతిపక్షాల కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేందుకే జీవో -1 తెచ్చారని దుయ్యబట్టారు. షరతుల పేరుతో.. గొంతెత్తకుండా చేయాలనుకోవడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం,.. తన బాధ్యత సక్రమంగా నిర్వహించి ఉంటే.. తొక్కిసలాటలు జరిగేవి కాదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
2008లో.. ప్రజారాజ్యం పార్టీ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి నలుగురు చనిపోయారని,.. అప్పట్లో డీజీపీ సహేతుకమైన సర్క్యులర్ ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవో నంబర్-1జారీ తర్వాత చంద్రబాబును కుప్పం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. అదే సీఎం పర్యటించే ప్రాంతాల్లో ఇళ్ల ముందు పరదాలు కట్టి.. పాఠశాలలకు సెలవులు కూడా ఇస్తున్నారని గుర్తుచేశారు.
ప్రభుత్వం.. అధికార పార్టీ విషయంలో ఒకలా ప్రతిపక్షాల విషయంలో మరోలా దురుద్దేశంతో.. వ్యవహరిస్తోందన్నారు. జీవో నంబర్-1 ఉత్తర్వులు పాలనాపరమైనవి కావని, విధాన నిర్ణయమని.. సీపీఐ నేత కె.రామకృష్ణ తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ వాదించారు. అందుకే... జీవో 1పై విచారణ చేసే అధికారం వెకేషన్ బెంచ్‌కు ఉందన్నారు. మరోవైపు.. ‘పోలీసు చట్టానికి లోబడే జీవో నంబర్-1 ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. రహదారులపై.. ర్యాలీలు, సభలు, పాదయాత్రలను పూర్తిగా నిషేధించలేదన్నారు. అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగిన ఉత్తర్వులిస్తామన్నారు. లోకేశ్ పాదయాత్రకూ.. అనుమతించినట్లు కోర్టుకు తెలిపారు. వాదప్రతివాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. వారంలోగా నిర్ణయం వెల్లడిస్తాని ప్రకటించింది.
ఇవీ చదవండి: