High Court on R5 Zone Issue: రాజధానేతర ప్రాంత ఆర్థిక వెనుకబడిన తరగతులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరించేందుకు హైకోర్టు నిరాకరించింది. రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు భూ బదలాయింపు చేస్తూ ఇచ్చిన జీవో 45, ఆ జీవో పర్యావసానంగా జరిపే ఇళ్ల స్థలాల కేటాయింపు ఈ వ్యాజ్యాల్లో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా, జస్టిస్ రవినాథ్ తిల్లరీతో కూడిన ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
గతంలో రూపొందించిన బృహత్తర ప్రణాళికలో ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు నిర్థిష్టమైన ప్రాంతాన్ని రిజర్వు చేసినట్లు కనిపించడం లేదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తోందని, ఆ భూమి భూసమీకరణ పథకం కింద లే అవుట్ల కోసం కేటాయించిన దానిలో భాగం కాదని తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపింది. ఈడబ్ల్యూఎస్ వారికి ఇవ్వదలచిన ప్రాంతంపై పిటిషనర్లకు ప్రత్యక్ష సంబంధం లేదని తాము గమనించామని తెలిపింది.
ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన భూమి ఎలక్ట్రానిక్ సిటీ కోసం రిజర్వు చేసిందని పేర్కొంది. రాజధాని అభివృద్ధి నవనగరాలతో ముడిపడి ఉందా అనే వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని.. ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన భూముల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు పొందే హక్కు లేనందున.. ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులపై నేరుగా ప్రభావం ఉండదని ధర్మాసనం తెలిపింది. రాజధాని నగరాభివృద్ధి కోసం భూసమీకరణలో భూములు ఇచ్చామని, ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు సైతం ఆ అభివృద్ధిలో భాగమని, ఎలక్ట్రానిక్ సిటీ మూలాలను దెబ్బతీయడం తమ హక్కులను హరించడమేనని పిటిషనర్లు వాదించారు.
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్లో ఉందని.. రాజధాని నగర నిర్మాణం, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని రెండో ఆదేశాన్ని సుప్రీంకోర్టు (2022 నవంబర్ 28న ఇచ్చిన ఉత్తర్వుల్లో) నిలుపుదల చేయలేదని హైకోర్టు తెలిపింది. అభివృద్ధి పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతిచ్చిందని.. ఈడబ్ల్యూఎస్, దారిద్య్ర రేఖకు దిగువున జీవిస్తున్నవారితో సహా సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి అందులో భాగమేనని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ పెండింగ్లో ఉండగా పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం న్యాయ మర్యాదను ఉల్లంఘించడమే అవుతుందని తీర్పులో తెలిపింది. గతేడాది నవంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లు వేసిన అన్ని అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.