AP High Court on Public Representatives Cases :ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ ఏ దశలో ఉందో పూర్తి వివరాలను పట్టిక రూపంలో నివేదిక ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, అవి ఏ దశంలో ఉన్నాయి, ఏ చట్టం ప్రకారం ఏ సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది, అభియోగాలు నమోదు చేశారా? లేదా? విచారణ జాప్యానికి కారాణాలేమైనా ఉన్నాయా? తదితర వివరాలు పట్టికలో పేర్కొనాలని తెలిపింది.
హైకోర్టు సంచలన నిర్ణయం - ఎన్నికల వేళ ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతానికి చర్యలు
HC Measures to Speed Up Cases MPs and MLAs :పోక్సో, అవినీతి నిరోధక చట్టం, ఎస్సీ, ఎస్టీ, పీఎల్‌ఎంఏ, ఎన్డీపీఎస్ వంటి ప్రత్యేక చట్టాల కింద కేసులు నమోదైన సందర్భంలో ఆ కేసులను ఏ కోర్టు విచారణ జరపాలనే వ్యవహారంపైనా స్పష్టత ఇవ్వాలని ఏజీ శ్రీరామ్, విజయవాడ ప్రత్యేక కోర్టు తరఫు న్యాయవాది వివేక్‌చంద్ర శేఖర్‌కు సూచించింది. సంబంధిత తీర్పులను అధ్యయనం చేయాలని సూచించింది. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని విచారణలల్లో జాప్యం జరగకుండా చూడాల్సిన అవసరం తమపై ఉందని వ్యాఖ్యానించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, హైకోర్టుపబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.