High Court on Insurance Premium: ప్రీమియం సొమ్ము చెల్లించిన రోజు నుంచే వాహనాలకు ప్రమాద బీమా వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. సొమ్ము చెల్లించిన మరుసటి రోజు బాండ్ జారీ అయినందున ఆ రోజు నుంచే ప్రమాద బీమా వర్తిస్తుందని ఇన్సూరెన్స్ సంస్థ తరఫు న్యాయవాది చేసిన వాదనలను తోసిపుచ్చింది. ప్రీమియం సొమ్మును బీమా సంస్థ అంగీకరించాక పాలసీ తక్షణం అమల్లోకి వస్తుందనే సదుద్దేశంతో చెల్లింపుదారులు ఉంటారని పేర్కొంది. ప్రమాద ఘటనకు ముందే ప్రీమియం అందుకున్నప్పటికీ పాలసీలో పేర్కొన్న తేదీ, సమయం నుంచే బీమా వర్తిస్తుందన్న కారణం చూపుతూ బీమా సంస్థ సొమ్ము చెల్లింపు బాధ్యత నుంచి తప్పించుకోజాలదని స్పష్టం చేసింది.
ఓ కారు ప్రమాదంలో గాయాలపాలైన మహిళకు రూ.30వేల పరిహారం చెల్లించాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవరించి పరిహారాన్ని రూ.లక్షకు పెంచింది. ట్రైబ్యునల్ ఆదేశించిన ప్రకారం పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ బీమా సంస్థ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. మరోవైపు పరిహారం పెంచాలని కోరుతూ బాధితులు అప్పీల్ దాఖలు చేయకపోయినప్పటికీ గాయాల తీవ్రత తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పరిహారాన్ని పెంచే అధికారం హైకోర్టుకు ఉందని తెలిపింది. మోటారు వాహనాల చట్ట నిబంధనలు ప్రమాద బాధితులపై కనికరం చూపేవిగా ఉన్నాయని గుర్తు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.