AP High Court Judgement on SI Candidate Height Issue :ఎస్ఐ పోస్టుల భర్తీ ప్రక్రియలో అభ్యర్థుల ఎత్తును డిజిటల్ మెషిన్ ద్వారా లెక్కించడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. ఎత్తును కొలిచేందుకు డిజిటల్ సామాగ్రిని వినియోగిస్తామని నోటిఫికేషన్లోనే పేర్కొన లేదని గుర్తు చేసింది. గత పది సంవత్సరాలుగా అభ్యర్థుల శారీరక కొలతలను డిజిటల్ సామాగ్రిని వినియోగించి నిర్ణయిస్తున్నామన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను అంగీకరిస్తే.. 2018లో అర్హులైన వారు 2023లో ఏ విధంగా అనర్హులు అవుతారని ప్రశ్నించింది. ఓ అభ్యర్థి 2018లో 167.8 సెంటీ మీటర్ల ఎత్తుంటే.. 2023లో నిర్వహించిన పరీక్షలో 166.9 సెంటీ మీటర్లు మాత్రమే ఉన్నట్లు ఫలితం వచ్చిందని గుర్తు చేసింది.
AP High Court New judges: ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
High Court Judgment on SI Exams :కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల ఎత్తును లెక్కించే విధానంలో తేడాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో 95 మంది పిటిషనర్లను మాన్యువల్ విధానంలో ఎత్తును కొలవాలని పోలీసు నియామక బోర్డును ఆదేశించింది. అందులో అర్హులైన వారిని ప్రధాన రాత పరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసింది. ఎత్తును కొలిచే ప్రక్రియను మరో మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అధికారులు తీసుకునే నిర్ణయం మరోసారి వివాదానికి తావివ్వకూడదని తెలిపింది. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఈనెల 14, 15 తేదీలలో ప్రధాన రాత పరీక్ష నిర్వహించుకునేందుకు అధికారులకు స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొంది. అయితే పిటిషనర్లలో అర్హత సాధించిన వారిని కలుపుకొని మాత్రమే ఒకేసారి తుది ఫలితాలు ప్రకటించాలని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత ఈ మేరకు తీర్పు ఇచ్చారు.