AP High Court: పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్ల ముద్రణ, వినియోగం వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వం జారీచేసిన నిషేధ ఉత్తర్వులు పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లకు వర్తించవని స్పష్టం చేసింది. మరోవైపు ఫ్లెక్సీలను నిషేధిస్తూ తెచ్చిన జీవోలు, నోటిషికేషన్లు పర్యావరణ చట్టం సెక్షన్ 5, నిబంధన 34, కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టు 12న ఇచ్చిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా ఉన్నాయని ప్రాథమికంగా అభిప్రాయపడింది.
శాస్త్రీయ అధ్యయనం ఏమైనా చేశారా?:నిషేధంపై ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించింది. ‘పర్యావరణానికి ఏవిధంగా హాని కలిగిస్తున్నాయో శాస్త్రీయ అధ్యయనం ఏమైనా చేశారా? వ్యాపార భాగస్వాములకు నోటీసులిచ్చి, వారి వివరణను పరిగణనలోకి తీసుకున్నారా? ఆయా పరిశ్రమలపై వేల మంది కార్మికులు, వ్యాపారులు ఆధారపడి ఉంటారు. ఈ అంశాలను పరిశీలించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు. మీది తొందరపాటు నిర్ణయం. మేం జోక్యం చేసుకుంటేనేమో... ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకున్నాయని మీరే(ప్రభుత్వం) ఆరోపిస్తున్నారు?’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది.