'కేసు నమోదు, దర్యాప్తు చేయటం, ఎలక్ట్రానిక్ సామగ్రిని స్వాధీనం చేసుకోవడంలో మంగళగిరి సీఐడీ ఠాణా పోలీసుల అత్యుత్యాహం చూస్తుంటే.... అధికారంలో ఉన్న పార్టీని సంతృప్తి పరచడానికి అన్నట్లుంది. పార్టీలు అధికారంలోకి రావొచ్చు. కొంతకాలం తర్వాత అధికారం కోల్పోవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉందనే దాంతో సంబంధం లేకుండా అధికారి పనిచేయాలి. సరైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, దర్యాప్తు ముసుగులో ప్రజల్ని వేధించడం అరాచకత్వానికి దారి తీస్తాయి. ప్రజలు ప్రజాస్వామ్యంలో(డెమోక్రసీ) కాకుండా... ఖాకీస్వామ్యంలో(ఖాకిస్టోక్రసీ) జీవిస్తున్నారనే భావనలు అధికారులు కలిగిస్తున్నారు. ఇలాంటి అధికారులు చర్యలను నియంత్రించకుంటే జీవించే హక్కు, స్వేచ్ఛ, వ్యక్తుల ప్రతిష్ఠకు నష్టం కలిగే తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి' అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. 'తెలుగువన్.కామ్' డిజిటల్ మీడియా ఎండీ కె.రవిశంకర్‌పై మంగళగిరి ఠాణా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కేసును రద్దు చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని వెనక్కి ఇవ్వాలని సీఐడీని ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వంపై అభ్యంతరకరంగా ఉన్న తెలుగువన్ న్యూస్ ఛానల్‌కు చెందిన వార్తను యూట్యూబ్‌లో చూశానని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పి. జగదీష్ అనే వ్యక్తి సీఐడీ అదను డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరి సీఐడీ ఠాణాలో ఈ ఏడాది ఏప్రిల్ 29న ఐపీసీ 188, 505(2 ), 506, విపత్తుల నిర్వహణ చట్టం సెక్షన్ 54 కింద తెలుగువన్ న్యూస్ ఛానల్ ఎండీ రవిశంకర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ రవిశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి... సీఐడీ పోలీసుల తీరును తప్పుపడుతూ ఇటీవల తీర్పు ఇచ్చారు.
ఆ సెక్షన్ కింద కేసు ఎలా పెడతారు?