HC ON CID NOTICES TO AUDITORS: ఛార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) శ్రావణ్ అరెస్ట్‌పై ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలో ఈనెల 2న నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడినందుకు సీఐడీ నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు ఛార్టెర్డ్ అకౌంటెంట్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి మంగళవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. సీఐడీ నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఛార్టెర్డ్ అకౌంటెంట్లు పీవీ మల్లికార్జునరావు, ముప్పాళ్ల సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన విచారణలో సీఐడీ తరఫున న్యాయవాది శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఐడీ నోటీసులో పేర్కొన్న తేదీల కాల పరిమితి ముగిసినందున మరోసారి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ తేదీల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో అనుబంధ పిటిషన్ నిరర్థకం అవుతుందన్నారు. దానిపై విచారణను మూసివేయాలని కోరారు. సీఐడీ జారీచేసిన నోటీసు చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని ప్రధాన అభ్యర్థన చేసిన నేపథ్యంలో వ్యాజ్యాన్ని పెండింగ్‌లోనే ఉంచాలన్నారు. తాజాగా నోటీసు ఇస్తే దానిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేయడానికి వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రధాన వ్యాజ్యంపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
సీఐడీ నోటీసులపై హైకోర్టు న్యాయవాదుల సంఘం మరో నిర్ణయం: మార్గదర్శి చిట్స్ వ్యవహారంలో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై.. హైకోర్టు న్యాయవాదులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ నోటీసులపై చర్చించేందుకు అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించాలంటూ కార్యనిర్వాహణణ కమిటీని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కోరింది. ఈమేరకు 268 మంది న్యాయవాదుల సంతకాలు సేకరించింది.
మార్గదర్శి వ్యవహారంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏపీ ప్రొషెషనల్ ఫోరం ఈనెల 2న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాగా.. అందులో హైకోర్టు న్యాయవాదులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తీకరించారు. ఆడిటర్ శ్రవణ్‌కు.... అరెస్ట్ నుంచి చట్టబద్ధ రక్షణ ఉంటుందని.. అంతేకాక చిట్‌ఫండ్ వ్యవహారాలను నిర్ణయించే నిపుణత సీఐడీకి లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చిన న్యాయవాదులకు.. సీఐడీ నోటీసులు జారీ చేసినట్లు న్యాయవాదుల సంఘం.. హైకోర్ట్ కార్యనిర్వాహణ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది.