AP Govt Violating Rules for Paying Bills: రాష్ట్రంలో పోలవరం సహా పలు ప్రాజెక్టుల పనులు చేస్తున్న, సీఎం జగన్‌కు సన్నిహితమైన మేఘా కంపెనీ..ఒక కొత్త తరహా చెల్లింపుల ప్రతిపాదన తీసుకొచ్చింది. తమకు రావాల్సిన.. పెండింగు బిల్లులను ఎప్పుడు చెల్లించేదీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే.. ఆ మేరకు కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటానని మెలిక పెట్టింది. 2,000 కోట్ల వరకు మేఘా సంస్థకు ఇలా రుణం ఇచ్చేందుకు కెనరా బ్యాంకు.. ముందుకొచ్చినట్లు తెలిసింది. సీఎం జగన్‌కు సన్నిహితమైన సంస్థ అడిగిందే తడవుగా జలవనరులశాఖ దాదాపు 1,300 కోట్ల బిల్లులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించేలా గ్యారంటీ ఇస్తోంది.
ఈ విధానానికి.. బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజి త్రూ డిస్కౌంటింగ్ ఆప్షన్ అని పేర్కొంటున్నారు. సికింద్రాబాద్‌లోని.. లార్జ్ కార్పొరేట్ బ్రాంచిలో ఫలానా ఖాతాలో ఫలానా తేదీలోగా ఆ బిల్లు మొత్తం చెల్లిస్తామని.. జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి అంగీకరిస్తూ.. గ్యారంటీలు మేఘా కంపెనీకి ఇస్తున్నారు. ఆ కంపెనీ వాటిని చూపించి రుణం తీసుకుంటోంది. ఆ మొత్తాన్ని జలవనరులశాఖ.. ఆ అకౌంట్లో జమచేసిన తర్వాత.. బ్యాంకు తన రుణం, వడ్డీ వసూలు చేసుకుంటుంది.
AP Govt Paid Crores to Monopoly Firm Megha: మేఘాకు కోట్లు సమర్పణ.. దాచిన మెటీరియల్కూ చెల్లింపులు..!
పోలవరం ప్రాజెక్టు పనులు.. మేఘా కంపెనీయే చేస్తోంది. ఆ సంస్థకు 2024 మే 8 నుంచి ఆగస్టు 28 లోపు 255.79 కోట్ల బిల్లులు చెల్లిస్తామని గ్యారంటీ ఇస్తూ.. జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్.. గ్యారంటీ లేఖలు ఇచ్చారు. ఆ ప్రతిని.. ఆర్థికశాఖ కార్యదర్శికీ పంపారు. ఇది ఇంతవరకు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వచ్చే ఏడాది మే, ఆగస్టు నెలల్లో కచ్చితంగా బిల్లులు చెల్లిస్తామని.. జలవనరులశాఖ అంగీకరించిన గ్యారంటీ మొత్తం. ఇలా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి.. మొత్తం 1,300 కోట్ల వరకు ఎప్పుడు చెల్లించేదీ ముందే.. గ్యారంటీలు ఇవ్వనున్నారు.
ఆ ప్రతిపాదన ప్రస్తుత ఆర్థిక నిర్వహణ విధానాలకు పూర్తిగా భిన్నమని.. ఇలా చెల్లింపులు సాధ్యం కాదని తొలుత ఆర్థికశాఖ ఫైలులో పేర్కొందని.. ఇందుకోసం ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని రాసిందని తెలిసింది. సీఎం అనుమతితోనే.. ఉల్లంఘనలకు అడుగులు పడుతున్నాయని.. సమాచారం. వేలమంది కాంట్రాక్టర్లు ఏళ్ల తరబడి బిల్లులు రాక అగచాట్లు పడుతుంటే సీఎం జగన్ సన్నిహిత కంపెనీకి మాత్రమే ఇలా దాసోహం అంటున్నారు. అస్మదీయ గుత్తేదారుకు ఆర్థిక కోడ్ కూడా దాటి అండదండలు అందించడం అక్రమాలకు పరాకాష్ఠగా నిలుస్తోంది.