AP Govt Negligence on Persons with Disabilities: తల్లిదండ్రులకు భారం కాకుండా సహచరులతో కలిసి పనులు చేస్తూ వచ్చిన కూలి డబ్బులతో సొంత అవసరాలు తీర్చుకుంటున్న దివ్యాంగులను జగన్ ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టింది. తమ గ్రామంలోనే కొన్నేళ్లుగా ఉపాధి పొందుతున్న లక్షలాది మంది దివ్యాంగులకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వం తొలగించింది.
ఈ కారణంగా చాలీచాలని వేతనాలతో కుటుంబానికి భారమై వారు ప్రస్తుతం తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ ఉపాధి హమీ పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు వైసీపీ పాలనలో అటకెక్కాయి.కేంద్ర ప్రభుత్వమేఇందుకు కారణమని నిందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్యాయానికి గురైన దివ్యాంగులకు తిరిగి న్యాయం జరిగేలా ఒక్క ప్రయత్నమూ లేదు. కేంద్రానికి లేఖ రాసి దివ్యాంగులకు జరిగిన అన్యాయం గురించి వివరించిన దాఖలాలూ లేవు.
Irregularities in MGNREGA Works: ఉపాధి హామీ పథకంలో అక్రమాలు.. సామాజిక తనిఖీల పేరుతో భారీగా దోపిడీ
MGNREGA Implementation in AP:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన దివ్యాంగులకు 2021కి ముందు ఏడాదిలో 100-150 రోజులు పని కల్పించేవారు. మిగిలిన వారికి కుటుంబం మొత్తానికి 100 రోజుల పని దినాలు కల్పిస్తే.. దివ్యాంగులకు 50 ఎక్కువ పని దినాలను కేటాయించేవారు. వీరిని ఒక్కరినే కుటుంబంగా పరిగణించడంతో మరింత లబ్ధి చేకూరేది. 30 శాతం భత్యం కూడా అదనంగా ఇచ్చే వారు. ఉదాహరణకు ఒక గ్రూపులోని 10 మంది కూలీలకు ఒక అడుగు లోతు, 10 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పులో చెరువులో మట్టి తీసే పని అప్పగిస్తే.. వికలాంగుల గ్రూపులోని 10 మంది సభ్యులకు అదే పని విస్తీర్ణాన్ని 30 శాతం మేర తగ్గించి కేటాయించేవారు.
అధికారిక లెక్కల్లో వీరు కూడా మిగిలిన గ్రూపులతో సమానంగా పని చేసినట్లుగానే చూపించేవారు. దీనివల్ల 30 శాతం తక్కువ పని చేసినా ఇతర గ్రూపుల సభ్యులతో సమానంగా దివ్యాంగులకు వేతనం వచ్చేది. ఉపాధి పనులకు హాజరయ్యే దివ్యాంగులు 2021 నవంబరు నుంచి అదనపు సదుపాయాలను కోల్పోయారు. పని దినాలను 100కే పరిమితం చేశారు. ఒక్కరిని కుటుంబంగా పరిగణించే విధానం కూడా లేదు.