AP Emp Association On PRC: రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన 23శాతం ఫిట్‌మెంట్‌పై ఉద్యోగుల సంఘాల నాయకులు సమ్మతి తెలిపినా... సగటు ఉద్యోగి అసంతృప్తిగా ఉన్నాడని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. తాజా వేతన సవరణ వల్ల ఉద్యోగుల జీతాలు పెరగబోవని తెలిపారు. డీఏ, బకాయిలు కలిపి వచ్చే నెల జీతం ఇస్తునందున పెరుగుదల కనిపిస్తుందేతప్ప జీతాలు పెరగలేదని అన్నారు. మూల వేతనం పెరిగినప్పుడే జీతాలు పెరుగుతాయని, పాత బకాయిలు కలిపి ఇస్తే ప్రయోజనం ఉండబోదని తెలిపారు.
పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు భిన్నంగా..
ఈనెల 6న సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో తమ సంఘం తరపున అన్ని అంశాలు నివేదించామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్నందున శుక్రవారం నాటి సమావేశానికి తాము హాజరు కాలేదని పేర్కొన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం చేసిన ప్రకటన మేరకు నాలుగు అంశాలను చూసి తాను స్పందిస్తున్నానని... విషయాలు పూర్తిగా తెలియరాలేదని తెలిపారు. గతంలో పీఆర్సీ కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారం 10 నుంచి 15శాతం పెంచి వేతన సవరణ చేసేవారని... దానికి భిన్నంగా ఈసారి జరిగిందన్నారు.