AP Govt Debt Taking Attempt Failed on Beverages Corporation: మద్యంపై మళ్లీ రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి, ఆ భరోసాతో ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ తరపున అప్పు పుట్టిద్దామని చేసిన ప్రయత్నం విఫలమైంది. 11వేల 850 కోట్ల మేర అప్పు తీసుకునేందుకు ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ జారీ చేసిన జీరో కూపన్ మద్యం బాండ్లకు స్పందన కొరవడటంతో వాటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా మరోసారి అప్పు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విఫలయత్నం చేసింది. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా 11వేల 850 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు జీరో కూపన్ మద్యం బాండ్లు జారీ చేసింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. కార్పొరేషన్ చెల్లించకుంటే సర్కారే బాధ్యత వహిస్తానని అంగీకరించింది. ఇందుకు సంబంధించి జీవో 345 జారీ చేసింది. అయినా ఆ బాండ్లకు పరపతి లేకుండా పోయింది.
CPI Ramakrishna comments on AP debts: రాష్ట్ర అప్పులపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది: రామకృష్ణ
రుణ ప్రయత్నాలు ఇలా బెడిసి కొట్టడం ఇది రెండోసారి. గతంలో ఓసారి రుణాలు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో తీసుకునేందుకు ప్రయత్నాలు సాగాయి. తొలుత 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు 9.62 శాతం వడ్డీకి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను కార్పొరేషన్ జారీ చేసింది. మే 15న ఇందుకు సంబంధించి ట్రేడింగ్ జరగాల్సి ఉండగా మే 11న ముంబయి స్టాకు ఎక్స్ఛేంజిలో లిస్టింగ్ ఆపరేషన్లకు సంబంధించిన సీనియర్ మేనేజర్ ఈ ట్రేడింగ్లో సభ్యులు ఎవరూ పాల్గొనవద్దని నోటీసు జారీ చేశారు. ఏ కారణంతో వాటిని జారీ చేశారో స్పష్టత లేదు కానీ, మొత్తం మీద నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో రుణ సమీకరణ సాధ్యం కాలేదు. ఇప్పుడు తాజాగా వైసీపీ సర్కారు కొత్త ఎత్తుగడ వేసి బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా జీరో కూపన్ల రూపంలో బాండ్లు జారీ చేశారు. వీటికీ స్పందన రాకపోవడంతో.. రెండుసార్లు రుణ సమీకరణ ప్రయత్నం బెడిసికొట్టినట్లయింది.
వాస్తవానికి ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం మద్యంపై వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుంది. మద్యంపై 130 శాతం నుంచి 190 శాతం వరకు వ్యాట్ వసూలు చేసే వారు. దాన్ని 35 శాతం నుంచి 60 శాతానికి తగ్గించింది. ఇక్కడ తగ్గించిన మేరకు బేవరేజస్ కార్పొరేషన్ ప్రత్యేక మార్జిన్ రూపంలో విధించి వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నిజానికి ఏదైనా కార్పొరేషన్ సొంతంగా సుంకాలు, పన్నులు విధించి వసూలు చేసుకునే అధికారం లేదు. ఇలా వచ్చిన రాబడిని ఆ కార్పొరేషన్ ఆదాయంగా చూపి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో ఇంతవరకు 1148కోట్ల 82 లక్షల రూపాయల రుణం సమీకరించింది. మరింత అప్పు తెద్దామనుకుంటే కుదరకుండాపోయింది.