కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్న వేళ.. ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతూ వస్తోంది. గత నెలలో కేసులు తీవ్రస్థాయిలో ఉన్నప్పడు ప్రాణవాయువుకు ఏర్పడిన కొరత అందరినీ ఆందోళనకు గురిచేసింది. తిరుపతి రుయా ఘటన అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో తేరుకున్న ప్రభుత్వం ఆక్సిజన్ సమకూర్చుకునే విషయంలో గణనీయమైన పురోగతిని సాధించిందని చెప్పాలి.
గుంటూరు నుంచే ఈ ప్రక్రియకు ముందడుగు పడింది. జీజీహెచ్‌లో వందల మంది రోగులకు విశాఖపట్నం నుంచి రోజూ ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్న జిల్లా యంత్రాంగం.. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ప్రాణవాయువు నిల్వల్ని మెరుగుపర్చింది. ఆక్సిజన్ తయారీ, నిల్వ, సరఫరా చేసే పాత ప్రైవేటు యూనిట్లను పునరుద్దరించడంతోపాటు ఇతర మార్గాలను అన్వేషించి విజయవంతమైంది.
రాష్ట్రానికి 16 రోజుల స్వల్పకాలంలోనే 2వేల మెట్రిక్ టన్నులకు పైగా వైద్య ఆక్సిజన్‌ను రైల్వే శాఖ సరఫరా చేసింది. దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిరంతరంగా నడిపించారు. రాష్ట్రాలకు కావాల్సిన ఆక్సిజన్ అవసరాలను వీలైనంత త్వరగా తీర్చడానికి రైళ్లు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరేలా.. రైల్వే శాఖ సైతం గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ రైళ్లు త్వరగా చేరేలా పర్యవేక్షణకు రైల్వేలో వివిధ విభాగాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.