AP Government Trying to Get Debts:ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కొత్తగా మళ్లీ అప్పులు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా 11వేల 850 కోట్ల రుణాలను సమీకరించేందుకు చేసిన ప్రయత్నం రెండుసార్లు బెడిసికొట్టింది. బేవరేజస్ కార్పొరేషన్ బాండ్లకు మార్కెట్‌లో స్పందన లేక.. ఏం చేయాలో అర్థం కాక వాటిని ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. మరో రూపంలో ప్రయత్నిస్తోంది. నాన్‌కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలోనే ఏవైనా సంస్థలను ముందే సంప్రదించి ఏదో రూపంలో ఒప్పించి అప్పు పుట్టించేందుకు ప్రయత్నిస్తోంది. కనీసం 5 వేలకోట్లయినా ఎన్‌సీడీ రూపంలో తొలుత సంపాదించాలని యత్నిస్తున్నట్లు సమాచారం.
Security Auction in AP: మరోవైపు ఒక్క ఆగస్టులోనే సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు సమీకరించనుంది. ఇప్పటికే 4 వేల కోట్ల రుణం తీసుకోగా.. ఆగస్టు 22న నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని మరో వేయి కోట్లు సమీకరణకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఒక్క బహిరంగ మార్కెట్ ద్వారానే తొలి 5 నెలల్లో ఏకంగా 34వేల 500 కోట్ల అప్పులు చేసినట్లవుతుంది. ఈ నెలలో మిగిలి ఉన్న మరో వారం రోజుల్లో కేంద్రం నుంచి మరిన్ని అనుమతులు సంపాదించి రుణాలు పుట్టించే దిశగానూ ప్రయత్నిస్తోంది.
Andhra Pradesh Debts: కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇస్తూ కొందరు గుత్తేదారుల ద్వారా ప్రయత్నాలు సాగిస్తూ ఆ రుణాలు పొందడమే కాకుండా ఆ మొత్తం అదే గుత్తేదారుకు చెల్లించే దిశగాను రుణ సాధన, వితరణ సాగుతోంది. వివిధ కార్పొరేషన్లకు అదనపు గ్యారంటీలు ఇస్తూ రుణాలనూ సమీకరిస్తోంది. దీనికి కేంద్రం నుంచి వచ్చే ఇతర రుణాలు అదనం. జూన్ నెలాఖరు వరకు కాగ్ విశ్లేషించిన లెక్కల్లోనే పబ్లిక్ అకౌంట్ నుంచి 16వేల కోట్ల వరకు వినియోగించుకున్నట్లు గణాంకాలు చూపుతున్నాయి. ఏ రకంగా చూసినా ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 5 నెలల్లో రాష్ట్ర అప్పు 50 వేల కోట్లకు దాటిపోయినట్లు తెలుస్తోంది.
2023 డిసెంబరు నెలాఖరు వరకు రాష్ట్రం 30వేల 275 కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఆ తర్వాత విద్యుత్తు సంస్కరణల రూపంలో GSDPలో 1.5శాతం రుణాలు తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఆ సంస్కరణల అమలు తీరును బట్టి ఆ రుణాలకు ఎప్పటికప్పుడు అనుమతులు లభిస్తాయి. ఏ రూపేణా అయితేనేం ఆగస్టు 22న అదనంగా తెచ్చే వెయ్యి కోట్లతో కలిపి మొత్తం 34వేల 500 కోట్ల రుణం సమీకరించినట్లవుతుంది. తొలి తొమ్మిది నెలలకు కేంద్రం ఇచ్చిన అనుమతులకు మించి ఇతర రూపాల్లో వచ్చిన పర్మిషన్స్ కలిపి ఈ స్థాయి అప్పులు తెచ్చేశారు. కేంద్రం నుంచి మరిన్ని అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో అదనపు అప్పులు చేశారంటూ మినహాయించిన అంశాల్లోనూ రాష్ట్రం మినహాయింపులు కోరుతోంది.
AP Government Trying to Get more Debts రూ. 5వేల కోట్ల అప్పు ఇప్పించండి సార్!