ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Free Electricity Scheme: 'ఉచిత విద్యుత్ పథకానికి జగన్ సర్కార్ మంగళం.. సైలెంట్​గా లబ్ధిదారులను తప్పిస్తున్నారా..? - ఉచిత విద్యుత్ పథకం నుంచి లబ్ధిదారుల తొలగింపు

AP Govt Free Electricity Scheme: మాట తప్పనూ.. మడమ తిప్పనంటూ తరచూ జగన్‌ ప్రభుత్వం చెప్పే మాటలకు.. వారు చేసే పనులకు పొత్తనే ఉండదని కరెంటు ఛార్జీల రూపంలో మరోసారి నిరూపితమైంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అని చెప్పారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం మీ కోసమే అన్నారు. కానీ, ప్రభుత్వం కొత్త కొత్త కారణాలు చూపించి కనెక్షన్లు తొలగిస్తోంది. దీంతో పథకం అమలును ప్రభుత్వమే తుంగలో తొక్కినట్టైందని ప్రజలు విమర్శిస్తున్నారు. గడచిన ఏడాది కాలంలో 3.93 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం తొలగించింది. అసలు ఇంతలా విద్యుత్‌ కనెక్షన్లను ఎందుకు తొలగించింది? పేదలకు అండగా ఉంటానని చెప్పిన జగన్‌ సర్కార్‌.. ఇప్పుడు చేస్తోందేమిటి?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

SC STs Free Electricity Scheme Removal News
ఉచిత విద్యుత్ పథకానికి జగన్ సర్కార్ మంగళం

By

Published : May 9, 2023, 1:46 PM IST

ఉచిత విద్యుత్ పథకానికి జగన్ సర్కార్ మంగళం

AP Govt Free Electricity Scheme: పదేపదే ఎస్సీ, ఎస్టీలు.. సామాజిక న్యాయం అని చెప్పుకొచ్చే వైసీపీ ప్రభుత్వం అలాంటి బలహీన వర్గాలకే అన్యాయం చేస్తోంది. తొలుత ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారికి ఉచిత విద్యుత్ కనెక్షన్ అని చెప్పి పథకం తీసుకొచ్చారు. అలాగే నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని చెప్పింది. తీరా చూస్తే పరిస్థితి అందుకు భిన్నం. 200 యూనిట్లు ఉచితం అని చెప్పిన సర్కార్‌.. దాదాపు 3 లక్షల 93 వేల కనెక్షన్లు తొలగించింది. జగ్జీవన్‌ జ్యోతి పథకం నిబంధనల మేరకు అర్హతలున్న వారందరికీ కోత పెట్టేసింది. ఉచిత విద్యుత్‌ పథకం నుంచి ప్రభుత్వం తమను ఎందుకు తీసేసిందో తెలియక ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ఈ కరెంటు బిల్లులు మేము కట్టలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

బడుగు బలహీనవర్గాలకు 50 యూనిట్ల వరకు మాత్రమే ఉచితంగా విద్యుత్‌ పంపిణీ చేస్తుంటే.. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఆక్షేపణ వ్యక్తం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి.. మడమ తిప్పేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పలు పలికిన జగన్‌.. అధికారంలోకి రాగానే ఆ హామీలను మరవడమేంటి?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగజ్జీవన్ జ్యోతి పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఇచ్చే పథకంలోని లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టేశారు. అలాగే ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల 47 వేల మందికి లబ్ధి కలుగుతోంది. ఈ పథకానికి అర్హులైన వారిని గుర్తించే అంశంపై గత మే నెలలో ప్రభుత్వం ఓ సర్వే చేయించింది. అయితే వివిధ కారణాలతో 3.93 లక్షల మంది కనెక్షన్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో మొత్తం లబ్ధిదారుల్లో 18% మంది ఉచిత విద్యుత్ పథకానికి దూరమైన పరిస్థితి నెలకొంది. అర్హులైన లబ్ధిదారులు ప్రతీ నెలా వేల రూపాయల కరెంటు బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇదేనా పేదల పాలిట మీరు చూపించే సంక్షేమ ఔదర్యమని ప్రజలు సర్కార్‌ను నిలదీస్తున్నారు.

ప్రభుత్వం చేసిన సర్వే అంశాలు హాస్యాస్పదంగా ఉండటంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఆధార్ అనుసంధానం కాలేదని కొంతమందిని.. వివాహమై కుటుంబాలు వేరయ్యాయని మరి కొందరిని.. ఎస్సీ, ఎస్టీలను పథకం నుంచి తొలగించారు. నిజమైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రావాల్సిన ప్రయోజనాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. అటు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు కరెంటు వాడుకున్నప్పటికీ.. బిల్లులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెరిగిన జీవన ప్రమాణాల రీత్యా సామాన్యుల ఇళ్లలోనూ కనీసం ఒక్క ఫ్యాన్, రెండుమూడు లైట్లు, టీవీ వాడకం ఉంటోంది. వీరికి నెలవారీ విద్యుత్ వినియోగం కనీసంగా 100 నుంచి 150 యూనిట్ల వరకు ఉండే అవకాశముంది. అయితే ఏదైనా అనుకోని కారణాల వల్ల విద్యుత్ వినియోగం ప్రభుత్వం సూచించిన దానికంటే ఒక్క యూనిట్ పెరిగినా బిల్లులు అనూహ్యంగా వందలు, వేలల్లో వస్తున్నాయి. ఎన్నికల మేనిఫేస్టో ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను 200 యూనిట్లకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను సరిగ్గా అమలు చేయలేక రాష్ట్ర ప్రభుత్వమే తుంగలోతొక్కింది అనే ఆరోపణలున్నాయి.

వాస్తవానికి దళిత కాలనీల్లో నివాసం ఉండని ఎస్సీలకు, ఎస్టీలకు ఉచిత విద్యుత్ వర్తించదంటూ రాష్ట్ర ప్రభుత్వమే మెమో జారీ చేయటంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన 793/22 మెమో పూర్తిగా కులవివక్షను ప్రదర్శించేలా ఉందని ఆరోపణలూ పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఎస్సీ, ఎస్టీలు ఇతర కాలనీల్లో నివసిస్తే వారికి పథకం వర్తించదంటూ ప్రభుత్వమే ప్రకటించటం వెనక అంతర్యమేంటని అడుగుతున్నారు. అయితే జగజ్జీవన్ జ్యోతి పథకం ద్వారా ఇస్తున్న ఉచిత విద్యుత్ కోసం 2021-22లో 700 కోట్లు, 2022లో 782 కోట్ల మేర వెచ్చించినట్లుగా ప్రభుత్వం లెక్కలు చూపిస్తోంది. అర్హత ఉన్న లబ్ధిదారుల కనెక్షన్లను మేం తొలగించలేదని చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున కనెక్షన్లు తొలిగించటం తీవ్ర వివాదమైంది.

2019 జూలై 25వ తేదీన జీవో నెంబరు 91 ద్వారా అమలైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కనెక్షన్లు తొలగించామని ప్రభుత్వం చెబుతోంది. ఆధార్ అనుసంధానం, కుల ధ్రువీకరణ, ఆదాయపు పన్ను చెల్లింపులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా వేర్వేరు కారణాలను పరిగణనలోకి తీసుకుని కనెక్షన్లు తొలగించినట్టు చెప్తోంది. అయితే వాస్తవ పరిస్థితులు చూసుకుంటే గిరిజన తండాలు, ఎస్సీ కాలనీల్లో.. ఎంతో మంది అర్హులైన లబ్ధిదారులకు పథకం దక్కక వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. దీనిపై మాత్రం డిస్కంలు, ప్రభుత్వాలు కనీసం నోరు మెదపక పోవటం తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం అర్హులైన కుటుంబాల అందరికీ ఉచిత విద్యుత్‌ పంపిణీ పథకంను అందించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details