ప్రైవేట్ ఉపాధ్యాయుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. 4 నెలలుగా జీతాలు లేక వారు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం చేయాలి: పవన్ - ప్రైవేట్ ఉపాధ్యాయుల కష్టాలపై పవన్ స్పందన
ప్రైవేట్ విద్యా సంస్థలు జీతాలు చెల్లించకపోవటంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. వీరిలో కొందరు పండ్లు, కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం వీరికి సాయం చేయాలని పవన్ కోరారు.
'ఓనమాలు నేర్పే వారు నడిరోడ్డున నిలవాల్సి రావటం బాధాకరం. జీతాలు లేకపోవటంతో కొందరు ఉపాధ్యాయులు పండ్లు, కూరగాయలు అమ్ముకుంటున్నారని తెలిసింది. కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవటం ఆశ్చర్యకరం. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినా అధ్యాపకులకు వేతనాలు ఇవ్వకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలోని సిబ్బందిని ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సాయం అందించాలి. పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల యూనియన్ కోరుతోంది. వీటిని కల్పించటంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను' అని పవన్ ఓ ప్రకటనలో కోరారు.
ఇదీ చదవండి:విద్యాసంస్థలపై కరోనా కాటు.. ఉపాధ్యాయులపై కోలుకోలేని దెబ్బ