Jagananna Videsi Vidya Scheme: విదేశీ విద్య నిధుల విడుదల సమయంలో జగన్ చెప్పిన మాటలకు అర్థాలే వేరులే అన్నుట్లుంది నేడు పరిస్థితి. పిల్లల చదువుకు పేదరికం అడ్డు రాకూడదనే విదేశీ విద్య పథకం తీసుకొచ్చాం అని జగన్ అంటే.. దానికి అర్థం పేదలకు విదేశీ విద్యను దూరం చేయడమా అనే సందేహం వస్తోంది. టీడీపీ హయాంలో ఈ పథకం కింద వందలాది మంది విదేశాల్లో చదువుకున్నారు. జగన్ అధికారంలోకి రాగానే..ఆ పథకంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిలిపివేశారు.
మూడు సంవత్సరాల పాటు విదేశీ విద్యను ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు దూరం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో ఉన్న ఈ పథకానికి ఆ పేరును తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 200 వర్సిటీల్లో చదివే వారికే సాయం అందిస్తామనే నిబంధన విధించారు. ఇప్పుడు దీన్ని టాప్-50 వర్సిటీలకు పరిమితం చేసి, పేదలకు అవకాశాలు అందకుండా చేశారు.
విజయవాడకు చెందిన మైనారిటీ విద్యార్థి గత సంవత్సరం అక్టోబర్‌లో యూనివర్శిటీ ఆఫ్ షఫీల్డ్‌లో ఎంబీఏ కోర్సుకు దరఖాస్తు చేశారు. ఆ విశ్వవిద్యాలయం అప్పట్లో క్యూఎస్ ర్యాంకింగ్‌లో 96వ స్థానంలో ఉంది. ఆ కోర్సుకు విశ్వవిద్యాలయం ఇంటర్వ్యూ చేసి.. భారత్ నుంచి ఎంపిక చేసిన ఇద్దరిలో విజయవాడ విద్యార్థి ఒకరు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విశ్వవిద్యాలయంలో చేరాలి. రెండో విడత విదేశీ విద్యకు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే.. అప్పటికే నిబంధనలు మారిపోయాయి. టాప్ 50 ర్యాంకుల్లో ఉన్నా అక్కడ ఎంబీఏ కోర్సు బదులు ఆర్కిటెక్చర్ అండ్ బిల్డ్ ఎన్విరాన్‌మెంట్‌కు మాత్రమే ప్రభుత్వం అవకాశమిచ్చింది. దీంతో ఆ పేద విద్యార్థి ఆశలన్నీ అడియాశలయ్యాయి. రాష్ట్రంలో చాలా మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
విదేశీ విద్యలో అర్హుల సంఖ్యను తగ్గించి, డబ్బులు మిగుల్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇష్టారాజ్యంగా నిబంధనలు తీసుకొస్తూ పేదవారిని విదేశీ విద్యకు దూరం చేస్తోంది. ఏటికేడు కొత్త నిబంధనలతో అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తోంది. సాధారణంగా విదేశాలకు వెళ్లే ఏపీ విద్యార్థులు టాప్ 400లోపు ఉన్న వర్సిటీల్లోనే ఎక్కువగా చదువుతున్నారు. మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఒకసారి టాప్-200 అని, ఇప్పుడు సబ్జెక్టుల వారీగా టాప్-50 వర్సిటీల్లో ప్రవేశాలని నిబంధనలు పెడుతోంది. ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విదేశీ విద్య అవకాశం లభించేలా సరళతర నిబంధనలు పెట్టకుండా సబ్జెక్టుల వారీగా అనే నిబంధన ఎందుకనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌కు వెళ్తారు. మిగతా సబ్జెక్టుల్లో తక్కువగా ఉంటారు. అయితే విద్యార్థులెవరూ ఎంపిక చేసుకోని సబ్జెక్టులను సైతం లెక్కల్లో చూపుతూ విశ్వవిద్యాలయాల సంఖ్య పెంచినట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు టాప్ 50 విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించడం చాలా కష్టం. ప్రస్తుతం వీటిలో ప్రవేశాలు పొందుతున్న రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 3శాతం లోపే. ప్రభుత్వం ప్రకటించిన సబ్జెక్టుల్లో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌కు రాష్ట్రం నుంచి వెళ్లేవారు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. ఫైనాన్స్, ఎకౌంటింగ్, డిజైన్, ఆర్ట్, నేచురల్ సైన్స్, ఎకనామెట్రిక్స్, ఎకనామిక్స్ లాంటి కోర్సులను ఎంపిక చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి సబ్జెక్టులకు సైతం 50 వర్సిటీల చొప్పున చూపి, 379 విద్యాసంస్థలు, వర్సిటీల్లో అవకాశం కల్పించామని ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది.