Salary Cut for Late Attendance: రాష్ట్రసచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, వివిధ జిల్లాల కార్యాలయాల్లో ఆలస్యంగా విధులకు హాజరైతే ఇక నుంచి జీతాల్లో కోతలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అంతర్గతంగా మెమోను జారీ చేసింది. ఇప్పటికే వివిధ సందర్భాల్లో హాజరుకు సంబంధించి సర్కులర్లు జారీ చేసిన ప్రభుత్వం 10.10 నిమిషాల కంటే ఆలస్యంగా హాజరైతే విధులకు గైర్హాజరు అయినట్టు పరిగణిస్తామని స్పష్టం చేసింది. కార్యదర్శులు సైతం విధిగా సచివలాయానికి హాజరు కావాలని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ తో పాటు ముఖ ఆధారిత హాజరును కూడా సచివాలయంతో పాటు జిల్లా కలెక్టరెట్ల వరకూ తప్పనిసరి చేస్తూ సర్కులర్ జారీ చేసింది.
ఇకపై ఆలస్యంగా విధులకు హాజరైతే జీతాల్లో కోత విధించేలా సాధారణ పరిపాలన శాఖ మెమో జారీ చేసింది. సమయానికి కార్యాలయాలకు హాజరు కాకుండా విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఆ మెమోలో పేర్కోంది. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల ప్రకారం.. కార్యాలయాలకు పది నిమిషాల ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు జీతంలో కోత విధించేలా చర్యలు చేపట్టాల్సిందిగా బాధ్యులైన అధికారులు చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో అన్నికార్యాలయాల్లో ముఖ ఆధారిత గుర్తింపును అమలు చేస్తున్నారు. ఉద్యోగులు అంతా 10 గంటల నుంచి 10.10లోపు హాజరు నమోదు చేయాలని,ఆ తర్వాత వచ్చే వారికి ఆలస్యం అయినట్టుగా పేర్కోవాలని సాధారణ పరిపాలన శాఖ పేర్కోంది. ఆలస్యంగా విధులకు హాజరైన వారి జీతాల్లో కోత పెట్టాలని అంతర్గత సర్క్యులర్లో సూచించారు.