రాష్ట్రప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా డివిజన్లు, మండలాలు, జనాభా, భౌగోళిక స్వరూపం తదితర వివరాలు ఇప్పటికే సేకరించింది. తాజాగా జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు పంపాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించింది. ఈనెల 30లోగా వివరాలు పంపాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా ఆయా విభాగాల ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. కొన్ని నెలల్లోనే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయన్న ప్రచారం నేపథ్యంలో ఉద్యోగుల వివరాలు అడగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఉన్న జిల్లా స్థానంలో గుంటూరు, నరసరావుపేట, బాపట్ల కేంద్రంగా 3 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
జిల్లాల ఏర్పాటులో కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులను సర్ధుబాటు చేయటంపై ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించింది. అధికారులతో పాటు క్యాడర్ వారీగా ఉద్యోగుల వివరాలను పంపాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్ర, జిల్లా క్యాడర్ల పరిధిలోని అధికారులు, ఉద్యోగుల సమాచారాన్ని ఇవ్వాలని ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, సాంఘిక, బీసీ సంక్షేమశాఖలతో పాటు మిగిలిన శాఖల అధికారులు కూడా వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత క్యాడర్ల వారీగా అధికారులు, ఉద్యోగులను సర్ధుబాటు చేయనున్నారు. దీని కోసం సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి స్థానికత వివరాలను కూడా తీసుకోవాలని సూచించారు.