నరసాపురం ఎంపీగా గెలుపొందిన రఘురామకృష్ణంరాజు అరెస్టును ఖండించిన తెదేపా అధినేత చంద్రబాబుపై.. వైకాపా నేతల విమర్శలను తెదేపా నేత ఖుద్దూస్ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర దేశంలో చట్టాలకు అన్యాయం జరుగుతూ.. పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం విధానాలను అనుసరిస్తుంటే దానిని ప్రశ్నిస్తున్న తెదేపా అధినేతపై విమర్శలు చేస్తారా.. అని మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న తీరును ఆయన ఖండించారు.
ఈ కేసుకు ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం లేదని చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. సీఐడీ, సీబీసీఐడీ విభాగాలకు ప్రభుత్వంతో సంబంధం లేదా? అవి ప్రభుత్వ యంత్రాంగాలు కాదా? అని ప్రశ్నించారు. కరోనా రెండో దశ విలయతాండవం చేస్తుంటే వైకాపా నేతలు, ముఖ్యమంత్రి కక్షపూరిత వ్యవహారాలు చేయడం సరికాదని తెదేపా నేతలు మండిపడ్డారు. నమ్మకంతో ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకైనా ప్రభుత్వం.. కరోనా కష్ట కాలంలో వారికి అండగా నిలవాలని సూచించారు.