ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ, గుంటూరు అభివృద్ధికి యూనిడో సాయం

అమృత పథకం కింద దేశంలోని ఎంపికైన ప్రధాన నగరాల్లో విజయవాడ, గుంటూరు జిల్లాలకు స్థానం దక్కింది. ఈ 2 నగరాల అభివృద్ధి కోసం అమెరికాకు చెందిన యూనిడో సంస్థ ప్రతినిధులు విజయవాడకు వచ్చారు.

విజయవాడలో యూనిడో సంస్థ ప్రతినిధుల పర్యటన

By

Published : Apr 24, 2019, 7:00 PM IST

Updated : Apr 25, 2019, 8:52 AM IST

విజయవాడ, గుంటూరు అభివృద్ధికి యూనిడో సాయం

నగరాల్లో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, ప్రైవేటు పెట్టుబడులు పెంచి సమైక్యత భాగస్వామ్యం-నగరాల సుస్థిరాభివృద్ధిలో భాగంగా....ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి విభాగం....యూనిడో ప్రతినిధులు విజయవాడ నగరంలో పర్యటించారు. 2 రోజల పర్యటనలో భాగంగా నగర పాలకసంస్థ కార్యాలయంలో వివిధ శాఖాధిపతులతో సమావేశమయ్యారు. పథకం ముఖ్య ఉద్దేశాలు, సాధ్యాసాధ్యాలు పరిశీలించి అమలు చేయాల్సిన కార్యక్రమాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక సహా వివిధ అంశాలపై చర్చించారు. నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేసి....నగరాన్ని స్వచ్ఛ నగరంగా తయారుచేయడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, వ్యర్థాల నుంచి శక్తిని, గ్యాస్ తయారు చేయడం, విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించనుంది.

కాలుష్యరహితమే ప్రధాన లక్ష్యం

సమైక్యత భాగస్వామ్యం-నగరాల సుస్థిరాభివృద్ధిలో భాగంగా దేశం మొత్తం మీద 5 నగరాలు ఎంపిక కాగా....వాటిలో రాష్ట్రానికి చెందిన విజయవాడ, గుంటూరు ఉన్నాయి. వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి... యూనిడో సంస్థ విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమగ్ర నివేదిక అందించనుంది. ఇందులో భాగంగా... యూనిడో సంస్థకు చెందిన ప్రతినిధులు విజయవాడలో పర్యటించారు. ముందుగ నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖాధిపతులతో సమావేశమై.....ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, పునర్వినియోగ ఇంధన వాడకం, వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై ప్రైవేటు పెట్టుబడులు, బ్యాంకుల భాగస్వామ్యం ద్వారా నగరాభివృద్ధికి కృషి చేసే దిశగా ప్రాజెక్టు రూపకల్పన చేయాలని అధికారులు యూనిడో ప్రతినిధులైన బెర్కెల్, కరిష్మా కశ్యప్, యాన్ కే. సింగ్‌కు సూచించారు.

నగరాభివృద్ధికి యూనిడో చేయూత

ప్రపంచ పర్యావరణ విభాగం సహకారంతో రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధికి యూనిడో సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉండటం, నగరాభివృద్ధికి, ప్రజల సౌకర్యార్థం కాలుష్యరహిత రవాణా, వ్యర్థాల పునరుద్ధరణ, ఉద్యోగాల కల్పనకు సంబంధించి మౌలిక సదుపాయాల, పెట్టుబడులు పెంచే విధంగా యూనిడో సంస్థ అర్బన్ ప్లానింగ్ తయారుచేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాలలో 28 నగరాలను ఎంపిక చేసి సుమారు 150 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలని సంస్థ నిర్ణయించినట్లు ప్రతినిధులు తెలిపారు. భారత దేశంలో 5 ప్రధాన నగరాలైన మైసూర్, భోపాల్, జైపూర్, విజయవాడ, గుంటూరు నగరాలను సుస్థిర అభివృద్ధి నగరాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు నగరపాలక సంస్థ, ఆర్టీసీ, అమరావతి అభివృద్ధి సంస్థ, నెడ్ క్యాప్ అధికారులకు యూనిడో ప్రతినిధులు వివరించారు..

మరో నాలుగు నెలల్లో ప్రాజెక్టు నివేదిక

సమావేశం అనంతరం యూనిడో సంస్థ ప్రతినిధులు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సముదాయంలోని మురుగు నీటి వ్యవస్థను శుద్ధి చేసే విధానం, ప్రయాణ ప్రాంగణ సముదాయంలోని ఏర్పాట్లు, ప్రయాణికులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టులో భాగంగా పర్యావరణహిత రవాణా సాధనాలను పెంపొందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. మరో నాలుగు నెలల్లో యూనిడో సంస్థ విజయవాడ, గుంటూరుకి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక అందించనుందని అధికారులు భావిస్తున్నారు.

వ్యర్థాలతో విద్యుదుత్పత్తి

ఇప్పటికే నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల మురుగునీటి వ్యవస్థ నిర్వహణ చేస్తుండగా....ఈ ప్రాజెక్టులో భాగంగా పండిట్ నెహ్రూ ప్రయాణ ప్రాంగణ సముదాయంతో పాటు మరికొన్ని చోట్ల మురుగునీటి నిర్వహణ, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఇవీ చదవండి

'విజయసాయిరెడ్డి... ఆ పోస్టులు తొలగించండి'

Last Updated : Apr 25, 2019, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details