APERC SECOND DAY VIRTUAL MEETING :డిస్కమ్‌లు ప్రతిపాదించిన విద్యుత్ టారిఫ్ , వార్షికాదాయ వ్యయాలపై ఏపీఈఆర్సీ రెండో రోజూ వర్చువల్‌గా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ పరిధిలో ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణలో పౌరులు, పౌర సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రాష్ట్రంలో మూడు డిస్కమ్‌లు రెవెన్యూ లోటు రూ.12,792 కోట్లు చూపించాయని, ఈ మొత్తంలో ఎంతమేర ప్రభుత్వం భరిస్తుందో స్పష్టం చేయాలని, ఆ తర్వాతే టారిఫ్ ప్రకటించాలని సీఐటీయూ నేత సీహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు.
విద్యుత్ ప్రస్తుతం నిత్యావసర సరుకుగా మారిందని.. దీన్ని దృష్టిలో పెట్టుకునే డిస్కమ్‌లు వ్యవహరించాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగింపు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్పుల్లో ఉండి వేల కోట్ల రూపాయలతో స్మార్ట్ మీటర్లు కొని బిగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. హెచ్‌టీ కనెక్షన్లకు..యూనిట్‌కు అదనంగా 1.45 రూపాయల పెంచటం వల్ల కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ పరిణామం వల్ల ప్రత్యక్షంగా కొన్ని ఎంఎఎస్ఎంఈలు మూతపడి కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని తెలిపారు.