'5పర్సెంట్ మినిస్టర్' పక్కా ప్లాన్! - వచ్చే ఏడాది పనులు సైతం పాత కాంట్రాక్టర్‌కే AP Education Department Tenders: విద్యాశాఖలో ఏ పనులు జరిగినా 5శాతం కమీషన్ తీసుకుంటారనే ఆరోపణలు జగన్ కేబినెట్‌లోని ఓ సీనియర్ మంత్రిపై ఉన్నాయి. ఇప్పటికే మధ్యాహ్నభోజన పథకంలో అందించే చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్లను పాత గుత్తేదార్లకే ఏడాది కాలం పొడిగించడంలో ఆయన సఫలీకృతుడయ్యారు.
ఇప్పుడు విద్యాకానుకలో భాగంగా గత ఏడాది నోటు పుస్తకాలు, బెల్టులు, బూట్లు, బ్యాగ్‌లు, యూనిఫామ్, డిక్షనరీలు సరఫరా చేసిన గుత్తేదార్లకే 2024 జూన్‌లో అందించే వస్తువుల టెండర్లు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. విద్యాకానుక పాత గుత్తేదార్లతో చర్చలు జరిపే బాధ్యతను సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావుకు అప్పగిస్తూ ప్రభుత్వంతో జీఓ జారీ చేయించారు. ఇప్పుడు ఏకంగా 772 కోట్ల రూపాయల పనులను కొత్తగా టెండర్లు నిర్వహించకుండా తనకు అనుకూలంగా ఉన్నవారికి అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ కీలక అధికారి ఈ తతంగానికి సహకరిస్తున్నట్లు సమాచారం.
పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లకు మాత్రం టెండర్లు నిర్వహించాలని, మిగతా వస్తువులకు పాత గుత్తేదార్లతో సంప్రదింపులు జరపాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. టెండర్లు నిర్వహించేందుకు సమయం లేనప్పుడు, అత్యవసర సమయాల్లో కొన్నిసార్లు పాతవారికే పనులు అప్పగిస్తూ ఉంటారు. కానీ, జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దీనికి దాదాపు 6 నెలల సమయం ఉంది.
విద్యాకానుక కిట్ల మాటున 121 కోట్ల రూపాయలు హాంఫట్-విజిలెన్స్ హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం
మిగిలిన కిట్లను లెక్కలోకి తీసుకోనేలేదు: మే నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యాకానుక-5లో మొత్తం విద్యార్థుల సంఖ్య 39 లక్షల 51 వేల 827గా అధికారులు నిర్ణయించారు. వాస్తవంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 38.22 లక్షలు మాత్రమే. 2023-24 విద్యా సంవత్సరానివి దాదాపు 3లక్షల వరకు కిట్లు మిగిలాయి. అలాంటప్పుడు కొత్తగా కొనేవాటిలో వాటిని మినహాయించాల్సి ఉన్నా, అలా ఏమీ చేయలేదు.
టెండర్ల దస్త్రాన్ని తొక్కిపెట్టి: విద్యార్థులకు అందిస్తున్న బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల కాంట్రాక్టును పాత గుత్తేదారుకే ఇప్పించాలని అధికారులపై సీనియర్ మంత్రి ఒత్తిడి తెచ్చారు. టెండర్లు పిలవడానికి సదరు అధికారులు ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపినా దానిని మంత్రి రెండు నెలలు తొక్కిపెట్టారు. ఈ వ్యవహరంపై ఓ కీలక అధికారి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో టెండర్లు పిలిచారు. కొత్త టెండర్లు పిలిచినా కూడా గుత్తేదార్ల చెల్లింపులకు బ్యాంకు గ్యారంటీ ఇప్పించడంలో మంత్రి కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే, వీటిని సరఫరా చేసిన నెల రోజుల తర్వాత బ్యాంకు నుంచి తీసుకునేలా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది.
Irregularities in Jagananna Vidya Kanuka: గుత్తేదారులకు జగనన్న విద్యా'కానుక'.. విద్యార్థుల సంఖ్యకు మించి కిట్ల కొనుగోళ్లలో ఆంతర్యమేంటి!