CM MEET WITH YSRCP REGINAL CO ORDINATORS: వైసీపీలో అసమ్మతి స్వరాలు, విమర్శలు పెరుగుతోన్న దృష్ట్యా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో హడావుడి మొదలైంది. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపించిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. బుధవారం తన వద్దనున్న ఆధారాలను బయటపెట్టారు. దీంతో ఇటు రాజకీయంగానూ.. అటు ప్రభుత్వపరంగానూ తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో గతరాత్రి నుంచి నేటివరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల హడావుడి నెలకొంది.
వైసీపీలో రోజురోజుకు నెలకొంటున్న అసమ్మతి స్వరాలను, విమర్శలను నివారించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు ఈ రోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 26 జిల్లాలకు సంబంధించిన పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మర్రి రాజశేఖర్, ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.