AP CID Third Day Raids at Margadarsi Branches: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కక్ష సాధింపే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం తన కుట్రలను కొనసాగిస్తోంది. మార్గదర్శి చిట్స్‌కు సంబంధించిన బ్రాంచిల్లో రెండురోజులుగా సోదాలు నిర్వహిస్తున్న సీఐడీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు తదితర శాఖల అధికారులు.. వరుసగా మూడోరోజూ తనిఖీలు కొనసాగిస్తున్నారు.
విజయనగరం మార్గదర్శి బ్రాంచ్‌లో సీఐడీ సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. సీఐడీ డీఎస్పీ భూపాల్ ఉదయం 10న్నర గంటలకు తనిఖీలు ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన చిట్ రిజిస్ట్రార్ కీర్తిప్రియ, వారి సహయకులు ఉదయం 10గంటలకే మార్గదర్శి కార్యాలయానికి చేరుకొని.. చిట్ మొత్తాలు, ఖాతాదారులకు చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తున్నారు.. తిరుపతి మార్గదర్శి కార్యాలయంలో మూడో రోజు సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయం లోపలికి వస్తున్న కస్టమర్లు, ఇతరుల వివరాలను కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పోలీసులు సేకరించి లోపలికి అనుమతిస్తున్నారు.
YSRCP Government Actions on Margadarsi Chits: కడప, ప్రొద్దుటూరు మార్గదర్శి కార్యాలయాలకు మూడో రోజు ఉదయం 9 గంటలకే అధికారులు చేరుకుని తనిఖీలు మొదలుపెట్టారు. కడప మార్గదర్శి కార్యాలయానికి జిల్లా చిట్ రిజిస్ట్రార్ భారతితో పాటు సీఐడీ సీఐ ఆంజనేయ ప్రసాద్ బృందం చేరుకొని.. సోదాలు నిర్వహిస్తోంది. కడప మార్గదర్శి కార్యాలయంలో ఇటీవల క్లోజ్ అయిన 13 గ్రూపులకు సంబంధించి వివరాలను ఆరా తీస్తున్నారు. మినిట్ పుస్తకంలో ఏజెంట్లు, కస్టమర్లు పెట్టిన సంతకాలను పరిశీలన చేస్తున్నారు.
కస్టమర్లకు ఫోన్ చేసి.. చిట్ పాడుకున్న సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా..? మార్గదర్శి సిబ్బంది ఏమైనా ఇబ్బందులు పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని..అంత సవ్యంగా సాగిందని కస్టమర్లు చెప్పినప్పటికీ.. వారిని తికమక పెట్టే ప్రశ్నలు అడుగుతూ వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మార్గదర్శి కార్యాలయంలోనూ కస్టమర్లు, ఏజెంట్లకు సంబంధించిన వివరాలను.. ఉదయం నుంచి పరిశీలన చేస్తున్నారు.
Attacks on Margadarsi Offices: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు
శ్రీకాకుళం మార్గదర్శి కార్యాలయంలో వరుసగా 3 వ రోజు సిఐడి, రిజిస్ట్రేషన్ ఆఫ్ చిట్స్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ తో పాటు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు, కస్టమర్లకు ఫోన్ చేసి కార్యాలయానికి రావాలంటు ఒత్తిడి చేస్తున్నారు.